తిరుపతి మంగళం వద్ద ఉద్రిక్తత – ఆందోళనకారులపై పోలీసుల దాష్టీకం

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : తిరుపతి మంగళం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగనన్న పట్టాలు పొందిన లబ్దిదారులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు చూపాలని డిమాండ్‌ చేస్తూ …. సిపిఎం ఆధ్వర్యంలో లబ్దిదారులు తిరుపతి మంగళం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో తుడా క్వార్టర్స్‌ వద్ద సిపిఎం నాయకులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు పై సిఐ శ్రీకాంత్‌ రెడ్డి వ్యక్తిగతంగా దాడి చేశారు. సిఐ శ్రీకాంత్‌ రెడ్డి విచక్షణారహితంగా ప్రవర్తించారు. మహిళలు అని కూడా కనీసం చూడకుండా వారిని క్రూరంగా ఈడ్చి పారేశారు. శ్రీకాంత్‌ రెడ్డి వ్యవహార శైలి పై సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ … ఇండ్ల స్థలాలు చూపేవరకు ఇక్కడి నుంచి వెళ్లబోమని, అరెస్టు చేసినా బెదరబోమని స్పష్టం చేశారు. గతంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి మాట్లాడి… స్థలాలు చూపిస్తే అక్కడే కేటాయించేలా అధికారులకు ఆదేశిస్తానని మాట ఇచ్చారని ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన చోటుకి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. బలవంతపు అరెస్టులు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే ….        తుడా క్వార్టర్స్‌ లో గతంలో జగనన్న ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు వారున్న చోటునే ఇండ్ల స్థలాలిస్తామని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోని చెన్నాయి 195/2 లో ఉన్న 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని కేటాయించారు. ఆ తరువాత పేదలకు నిర్ణయించిన ఆ భూమిని వేరొక సంస్థకు ఇచ్చారు. స్థానికంగా ఇండ్లను ఇస్తామని చెప్పి… మాటమార్చి పేదల నివాసాలకు, బతుకుతెరువుకు సుదూరంగా ఇండ్ల స్థలాలిస్తామంటూ పట్టాలిచ్చారు. దీంతో పేదలంతా వాపోయారు. ఊరుకు దూరంగా ఇండ్ల స్థలాలిస్తే తామెలా బతకాలని వాపోయారు. స్థానికంగా స్థలాల్ని కేటాయించి మాటిచ్చి ఇప్పుడు మాట మార్చి ఊరుకు దూరంగా స్థలాలివ్వడంపై లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పక్షాన సిపిఎం నేతలు భూపోరాటం చేశారు. వాస్తవంగా పేదలకు నిర్ణయించిన భూభాగంలో ఎర్రజెండాలు పాతడానికి నేతలు ఈరోజు ఉదయం బయలుదేరారు. ఈ విషయం తెలిసిన పోలీసులు తెల్లవారుజామునుండే అరెస్టులు, గృహనిర్బంధాలు చేపట్టారు. ఈరోజు ఉదయం తుడా క్వార్టర్‌ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం నేతపై సిఐ శ్రీకాంత్‌ రెడ్డి దాడి చేశారు. మహిళలను ఈడ్చి పడేశారు.

➡️