మెగా డిఎస్‌సి కోసం కాంగ్రెస్‌ చలో సెక్రటేరియట్‌ ఉద్రిక్తం

పిసిసి అధ్యక్షులు షర్మిల అరెస్టు

సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల సంఘీభావం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్‌సి ప్రకటించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ పిసిసి చేపట్టిన చలో సెక్రటేరియట్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. తొలుత ఆంధ్రరత్న భవన్లో దీక్ష చేపట్టిన షర్మిల అక్కడ నుండి ప్రదర్శనగా బయలుదేరారు. స్వర్ణప్యాలెస్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అక్కడ వాహనాలు ఆపే క్రమంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది. దీంతో షర్మిల నేరుగా అన్ని వైపులా తిరుగుతూ వాహనాలను అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులు వాటిని దారి మళ్లించి పంపించేశారు. అక్కడ కొద్దిసేపు బైఠాయించిన అనంతరం ప్రదర్శనగా కంట్రోల్‌ రూము వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా బైఠాయించడంతోపాటు వాహనాను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడ నుండి వాహనాల ద్వారా సెక్రటేరియట్‌కు బయలుదేరారు. మధ్యలోనే కొన్ని వాహనాలను ఆపేసిన పోలీసులు ప్రకాశం బ్యారేజీ సమీపంలో కొండవీటివాగు లిఫ్టు వద్ద షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పటికే రుద్రరాజు, పద్మశ్రీ, తులసీరెడ్డి, మస్తాన్‌వలీ తదితరులను అరెస్టుల చేశారు. అరెస్టు సమయంలో షర్మిల ప్రతిఘటించడంతో బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాను ఎక్కించారు. అక్కడ నుండి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు తదితరులున్నారు. సుమారు రెండుగంటలపాటు షర్మిల రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. షర్మిలతోపాటు కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. విజయవాడ రాకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శమని, ఇప్పటికైనా మెగా డిఎస్‌సి ప్రకటించి నిరుద్యోగులకు ఊరట కల్పించాలని డిమాండు చేశారు.

సిపిఎం, సిపిఐ సంఘీభావం

ఆంధ్రరత్న భవన్లో షర్మిల దీక్షా శిబిరం వద్దకు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ వెళ్లారు. ఆమెతోపాటు అక్కడే బైఠాయించి సంఘీభావం ప్రకటించారు. మెగా డిఎస్‌సి వేస్తామని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మెగా డిఎస్‌సి ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న సిఎం మాటతప్పడమే కాకుండా అడిగిన వారిపై పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించడం సరికాదని అన్నారు. నిరసనలపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోందని, పార్టీ కార్యాలయాలనూ దిగ్భంధిస్తోందని, ఇంతకంటే నిరంకుశత్వం ఇంకొకటి లేదని అన్నారు. నిజంగా మాటమీద నిలబడే వ్యక్తయితే జగన్‌ వెంటనే మెగా డిఎస్‌సి ప్రకటించాలని కోరారు. సిఎం ఎక్కడకు వెళితే అక్కడ పోలీసులు సిపిఎం నాయకులను అరెస్టు చేస్తున్నారని, ఇదేమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలను ప్రజలు సహించబోరని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మూర్ఖపు పాలన చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో తాలిబన్‌ రాజ్యం : షర్మిల

రాష్ట్రంలో తాలిబన్‌ రాజ్యం నడుస్తోందని, ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే జగన్మోహన్‌రెడ్డి పోలీసులతో నిర్బంధిస్తున్నారని, ఇదేమైనా ఆప్ఫనిస్తానా అని పిసిసి అధ్యక్షులు షర్మిల ప్రశ్నించారు. 23 వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆరువేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం మోసం కాదా అని ప్రశ్నించారు. ఔట్‌సోర్సింగ్‌ పేరుతో అనుచరులను ప్రభుత్వశాఖల్లో నింపేశారని, వాటినే ఉపాధి కింద చూపిస్తున్నారని అన్నారు.. జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరూ బిజెపికి లంగిపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదాను తెస్తానని ఐదేళ్లలో ఒక్కసారి కూడా దాని గురించి కేంద్రంలో మాట్లాడలేదని అన్నారు. ఐదేళ్లలో 21వేలమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీరిలో పిజి చదివిన వారే 500 మంది ఉన్నారని అన్నారు. . సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు కూడా మాట్లాడారు.

టిడిపి ఖండన

షర్మిల అరెస్టును టిడిపి సీనియర్‌ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే సొంత చెల్లిని సైతం అరెస్టు చేయించిన జగన్‌ మూర్ఖత్వానికి ప్రజలు తగిన బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

➡️