ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

Jun 27,2024 21:50 #minister narayana, #speech

– అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు
– మంత్రి పి నారాయణ
ప్రజాశక్తి-నెల్లూరు :ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజలు సుఖంగా జీవించాలంటే వారు ఉన్న ప్రదేశంలో రోడ్డు, నీరు, డ్రైన్‌, కరెంట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లో హౌసింగ్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌, మైన్స్‌, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌తో కలిసి గురువారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పనితీరుపై క్షుణ్ణంగా ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ .. పార్టీలకతీతంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలిపారు. త్వరలోనే మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమాభివృద్ధిపై చర్చిస్తామని చెప్పారు. విద్యుత్‌, మైన్స్‌పై మరోసారి క్షుణ్ణంగా చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్‌ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️