60+ వయస్సులో

Jun 30,2024 10:26 #Dance, #old woman, #Sneha

‘వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే.. ప్రతిభ అనేది ఎవరినీ, ఎప్పటికీ విఫలం చేయదు.. దీనికి గడువూ, తేదీ అక్కర్లేదు’.. అంటున్నారు రవి బాలశర్మ. కోవిడ్‌ లాక్‌డౌన్‌ ఆమె జీవితంలో ఒక మలుపు తిప్పిందని.. ఆమె అభిరుచిని పునఃవ్యక్తీకరించే అవకాశం.. నెటిజన్ల ప్రశంసలు.. ఆమెకు అవార్డులని సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. ఇప్పుడు రవి బాలశర్మ ‘డ్యాన్స్‌ దాదీ’గా ఇన్‌స్టాగ్రామ్‌లో పేరొందారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందినవారు. వయసు పెరిగే కొద్దీ అనుభవం, సానుకూల దృక్పథం అలవడాలి అంటారు ఈ బాల దాదీ. డ్యాన్స్‌దాదీ నేపథ్యం ఆమె మాటల్లోనే..

‘మా నాన్నగారు సంగీత విద్వాంసులు. నేను ఆయన దగ్గర సంగీతం, తబలా నేర్చుకున్నాను. డ్యాన్స్‌ కూడా నాకు చాలా ఇష్టం. నేను కథక్‌ కొంతవరకు నేర్చుకున్నాను. ఫంక్షన్స్‌లో ప్రదర్శనలు ఇచ్చేదానిని. నా వివాహం అయిన తర్వాత, 1993లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో సంగీతం టీచరుగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 2019లో రిటైర్‌ అయ్యాను.

లాక్‌డౌన్‌తో మలుపు..
చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే మక్కువ ఉన్నప్పటికీ కుటుంబంపై దృష్టి సారించడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నా జీవితంలో ఒక మలుపు అయింది. నా అభిరుచిని మళ్లీ కొనసాగించడానికి ఇదే సమయం అనుకున్నాను. నేను మొదట 30 సెకన్ల వీడియో చేశాను. అది వైరల్‌ అయింది. నా పిల్లలు కూడా నన్ను ప్రోత్సహించారు’ అంటూ ఆనందంలో మునిగిపోయారామె.

ప్ర్రశంసలే అవార్డులు..
నెటిజన్లే కాక గాయకుడు, నటుడు అయిన దిల్జిత్‌ దోసాంజ్‌, చిత్రనిర్మాత ఇంతియాజ్‌ అలీ వంటి ప్రముఖులు కూడా ఆమె వీడియోలకు ప్రశంసలు కురిపించారు. ‘ఇంత పెద్ద వ్యక్తులు నా వీడియోకు స్పందిస్తారని కలలో కూడా అనుకోలేదు.. ఇదే నా జీవితంలో నేను ఊహించని అతిపెద్ద అవార్డు.. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే.. మీ జీవితంలోని ఏ దశలోనైనా మీరు గుర్తింపు పొందవచ్చు’ అంటూ హితవు చెబుతున్నారామె.

సానుకూల దృక్పథంతో..
‘అరవై ఏళ్లు పైబడిన వారు అన్ని విషయాలలో సానుకూల దృక్పథంతో ఉండాలి. నా వయస్సులో ఉన్నవారు చాలా మంది కీళ్ల నొప్పులు, కొలెస్ట్రాల్‌, అనేక ఇతర వయస్సు సంబంధిత వ్యాధుల గురించి మాట్లాడతారు. అటువంటి వ్యాధులతో పోరాడటానికి సానుకూల దృక్పథం కీలకమని నేను భావిస్తున్నాను. అది డ్రాయింగ్‌, పెయింటింగ్‌ లేదా వంట, మనకిష్టమైనది ఏదైనా సరే. అలా భావించాను కాబట్టే నేను ఇప్పుడు ఒక రాక్‌స్టార్‌ దాదీని అయ్యాను’ అంటారు మన డ్యాన్స్‌దాదీ. వయస్సు ప్రతిభకు ప్రతిబంధకం కాకూడదనేది ఆమె అభిప్రాయం. ‘నాకెలాంటి కష్టాలూ ఉండవు.. నాకన్నీ సంతోషాలే అని మీరనుకోవచ్చు. కానీ నేనూ చాలా కష్టాలు అనుభవించాను. వాటిని అధిగమించడానికి ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన డ్యాన్స్‌ చేయాలనునీ.. అది అందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలనీ వీడియోలు చేయటం..అవి వైరల్‌ అవుతుంటే మరింత శక్తిని పుంజుకోవటం నా వంతయింది’ అంటారామె.

కాళ్ళతోనే కాదు.. కళ్ళతోనూ..
మాధురీ దీక్షిత్‌ నటించిన ‘దిల్‌ తో పాగల్‌ హై’ సినిమాలో ‘కోయి లడ్కి హై’ పాటకు బాలా చేసిన డ్యాన్స్‌, అభినయం మాధురికి ధీటుగా ఉన్నాయి. పాటకి అనుగుణంగా హావభావాలు.. డ్యాన్స్‌ అంటే కాళ్లతోనే కాదు కళ్లతో కూడా అభినయాలు పలికించవచ్చని చెప్పటం మాధురి ప్రత్యేక లక్షణం. అవన్నీ బాలా డ్యాన్స్‌లో నెటిజన్లని ఉత్తేజపరిచాయి.
అలాగే శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ లోని ‘నవ్రారు మాఝీ’ సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్న పాట. దీనిలో శ్రీదేవిలానే చీరకట్టు.. ముస్తాబు.. స్టెప్పులు.. అభిమానులను అలరించాయి. ‘మేడమ్‌.. మీ డ్యాన్స్‌ సూపర్బ్‌.. శ్రీదేవిని దించేశారు’ అంటూ నెటిజన్ల ప్రశంసలు.
రవి బాలశర్మ అలియాస్‌ డ్యాన్స్‌దాదీకి ఇప్పుడు 64 ఏళ్ళు. ఆమె మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు డ్యాన్స్‌ ఒక మార్గమైంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 128 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరి మనందరికీ ఆమె స్ఫూర్తి దాతే కదా!

➡️