దత్‌, సాబ్జీల మరణం ఉద్యమాలకు తీరని లోటు

Dec 25,2023 08:45 #utf

– సంస్మరణ సభలో వక్తలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఎంఎకె దత్‌, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీల మరణం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల ఉద్యమాలకు తీరని లోటు అని సంస్మరణ సభలో పలువురు వక్తలు అన్నారు. నమ్మిన ఆశయాల కోసం కడదాకా ఉద్యమాలతోనే వారు ప్రయాణం చేశారని కొనియాడారు. భౌతికంగా మరణించినా వారి ఆశయాలు, చూపిన బాట సజీవంగానే ఉంటాయని తెలిపారు. ఎంబి విజ్ఞాన కేంద్రంలో దత్‌, సాబ్జీల సంస్మరణ సభ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. యుటిఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా ఇరువురి చిత్రపటాలకు యుటిఎఫ్‌ మాజీ అధ్యక్షులు కె జోజయ్య, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దత్‌, సాబ్జీ నిరంతరం ప్రజా ఉద్యమాలతో ఉంటూ ప్రజల కోసం తమ జీవితాలను అర్పించారని అన్నారు. సాబ్జీ శాసనమండలిలో ప్రజా, కార్మిక, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై నిత్యం గళం విప్పి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసేవారని చెప్పారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలిపి వస్తూ అకాల మరణం చెందటం ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు బడ్డు నాగేశ్వరరావు, కత్తి నరసింహారెడ్డి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, పూర్వ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జోజయ్య, పి బాబురెడ్డి, సీనియర్‌ నాయకులు సి కమలకుమారి, డి మస్తాన్‌రావు, తెలంగాణ యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావా రవి, బి నరసింహారావు, ఎస్‌టియు అధ్యక్షులు ఎల్‌ సాయిశ్రీనివాస్‌, ఎపిటిఎఫ్‌-1938 ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఎపిసిపిఎస్‌ఎ ప్రధాన కార్యదర్శి కె రాజేశ్వరరావు, నాయకులు పటాన్‌ బాజీ, సిఎం దాస్‌, హుస్సేన్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ.. గణిత ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించిన దత్‌ విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని కలిగించేలా చేసి మంచి ఉపాధ్యాయుడు అయ్యారని అన్నారు. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఉద్యమ శిక్షణ తరగతుల్లో బోధన ద్వారా అనేక మంది కార్యకర్తలను నాయకులుగా మార్చారని పేర్కొన్నారు. సాబ్జీ మరణం వరకూ ఉద్యమాలతోనే ఉన్నారని చెప్పారు. ప్రజా ప్రతినిధిగా అందరి సమస్యల పరిష్కారం కోసం, వారికి అందుబాటులో ఉంటూ కృషి చేశారని అన్నారు. సిపిఎస్‌ రద్దు కోసం బైకు జాతాలు, పాదయాత్రలు జయప్రదంగా జరగటానికి కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వాలు వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తున్న సమయంలో ప్రశ్నించే గొంతులైన దత్‌, సాబ్జీలను కోల్పోవడం బాధాకరమన్నారు. సాబ్జీ భార్య సుభానీ బేగం, కుమారుడు ఆజాద్‌ వారి అనుభవాలను పంచుకున్నారు.

➡️