రైతుల ఆవేదనను ప్రభుత్వం ఆలకించాలి

Mar 4,2024 20:07 #AP Rythu Sangam, #demands
The government should listen to the grievances of the farmers

ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇవ్వాలి

సంఘీభావం తెలిపిన వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : మంటల్లో దగ్ధమైన పసుపు పంటకు నష్టపరిహారం కోసం రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, దీనిపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఆదుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల కేంద్రంలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం వాటిల్లడంతో అందులో పసుపు పంటను దాచుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని కోరుతూ బాధిత రైతులు చేపట్టిన రిలేదీక్షలు సోమవారంనాటికి నాలుగో రోజుకు చేరాయి. శిబిరాన్ని సందర్శించిన రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాయని గుర్తు చేశారు. బీమా ప్రీమియంతో సంబంధం లేకుండా రైతులకు ప్రస్తుత ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రమాదం జరిగి 45 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రమాద కారణాలను విచారణ చేసి కోల్ట్‌ స్టోరేజీ యజమానిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్న శివశంకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల తీరు ఇదేవిధంగా కొనసాగితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, పరిహారం దక్కే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. ఘటనపై బీమా కంపెనీ రూపొందించిన నివేదికను వెల్లడించాలని కోరారు. వ్యకాస జిల్లా కార్యదర్శి ఇ అప్పారావు మాట్లాడుతూ రైతుల పోరాటంలో తమ సంఘమూ ప్రత్యక్షంగా పాల్గటుందని తెలిపారు. కార్యక్రమంలో పసుపు రైతు బాధిత కమిటీ కన్వీనర్‌ వి వెంకటరామయ్య, నాయకులు ఎం శివసాంబిరెడ్డి, జె బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు, రమేష్‌, చంద్రశేఖర్‌, సురేంద్ర, పుల్లయ్య, నాగయ్య పాల్గన్నారు.

➡️