అమరజీవి త్యాగనిరతి వెలకట్టలేనిది

  •  నెల్లూరు కలెక్టర్‌ హరినారాయణన్‌

ప్రజాశక్తి -నెల్లూరు : ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతి వెలకట్టలేనిదని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎల్లప్పుడూ పదిలమని పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ కూడలిలో ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. దేశ చరిత్రలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు నేటికీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, వారిలో పొట్టి శ్రీరాములు ఒకరని తెలిపారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆయన ప్రాణ త్యాగం ఫలితమేనని చెప్పారు. సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాల్లో గాంధీజీ వెంట పొట్టి శ్రీరాములు నడిచారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగు వారి పాత్ర ఎనలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

➡️