వేసవిలో ఉపశమనం – మరో 3 రోజులపాటు భారీ వర్షాలు

May 8,2024 10:48 #cold weather, #Summer, #Vijayawada
  • తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
  • మరో 3 రోజులపాటు కొనసాగే అవకాశం – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిప్పులు వెదజల్లే ఎండల నుంచి ప్రజలకు ఊరట దక్కింది. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కోనసీమ జిల్లా మండపేటలో 120.5 మి.మీ, రాజమండ్రిలో 92, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73, కోనసీమ జిల్లా ఆలమూరులో 73 మి.మీ వర్షపాతం నమోదైంది. దాదాపు 45 ప్రాంతాల్లో 20 మి.మీ నుండి 64 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో 43.2 డిగ్రీలు, కడప జిల్లా మద్దూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూర్మనాథ్‌ తెలిపారు. బుధవారం నాడు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

➡️