వారిది కూటమి కాదు.. అతుకుల బొంత : సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అతుకుల బొంతలా తయారైందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సిఎం జగన్‌ను ధూషించడం తప్ప ప్రజలకు చెప్పుకునేందుకు వారికి ఒక విధానం అంటూ లేదని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మూడు పార్టీలు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి 2014 నుంచి 2019 వరకు ఏం చేశాయో చెప్పాలన్నారు. చంద్రబాబు టిడిపి వారినే బిజెపి, జనసేన పార్టీల్లోకి పంపి టికెట్లు ఇప్పించుకుంటున్నారని అన్నారు. పవన్‌కల్యాణ్‌కు కనీసం రెండేళ్లయినా సిఎం పదవి ఇవ్వాలన్నది జనసైనికుల కోరికైతే, అది నెరవేరే అవకాశం లేకుండా టికెట్లలో కోతలు పెట్టారని విమర్శించారు. ఇచ్చిన 21 సీట్లలో పది నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లేనని అన్నారు. లాస్ట్‌ ఛాన్స్‌ అనే చంద్రబాబు మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకోనందునే అదుపు తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిరంజీవి మంచి సినిమా నటుడని, ఆయన రాజకీయాల్లోకి వస్తే రావచ్చు కాని బ్యాంకులను ముంచిన వారికి అండగా నిలవడం సరైందికాదన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ షర్మిల కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

➡️