సొంత చిన్నాన్నకే న్యాయం చేయనివారు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు

Apr 12,2024 21:23 #justice, #Kadapa, #Rally, #ys sharmila

– వివేక హంతకులను కాపాడుతున్న సిఎం జగన్‌
– బస్సుయాత్రలో వైఎస్‌ షర్మిల
ప్రజాశక్తి- వేంపల్లె/లింగాల (వైఎస్‌ఆర్‌ జిల్లా):సొంత చిన్నాన్నకే న్యాయం చేయనివారు ప్రజలకు న్యాయం చేస్తారని ఎలా అనుకోగలమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా నరికి చంపిన హంతకులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాపాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజవకర్గంలోని వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లో శుక్రవారం ఐదో రోజు షర్మిల బస్సుయాత్రను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మం ఒకవైపు.. అధర్మం మరొక వైపు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయన్నారు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా? లేక వివేకాను చంపిన హంతకుడు అవినాష్‌రెడ్డిని గెలిపిస్తారో ప్రజలు తేల్చుకోవాలన్నారు. హంతకులను జగన్‌ వెంట పెట్టుకొని వస్తుండడంతో వైఎస్‌ఆర్‌, వివేకా ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. హంతకులకే మళ్లీ ఎంపి సీటు ఇవ్వడంతోనే తాను ఎంపిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమని చెప్పారు. వివేకా సైతం ప్రజలకు సేవ చేశారని తెలిపారు. వివేకా చనిపోయి ఐదేళ్లు దాటిందని ఇప్పటి వరకు హంతకులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివేకా కుమార్తె వైఎస్‌.సునీత, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు పాల్గన్నారు.
లింగాలలో ఉద్రిక్తత
షర్మిల పర్యటనను లింగాలలో అడ్డుకునేందుకు వైసిపి శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అల్లరి మూకలను పోలీసులు చెదగొట్టారు. అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పర్యటనను అడ్డుకుంటున్నారని షర్మిల అన్నారు. అల్లరి చేసే వాళ్లు పులివెందులకు రండి పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదామన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందామని సవాల్‌ ఇసిరారు.

➡️