పలు జిల్లాల్లో ఉరుముల వర్షం

May 20,2024 08:30 #heavy rains
  • ఈదురుగాలులకు నేెలకొరిగిన చెట్లు
  •  పిడుగుపాటుకు ఒకరు మృతి

ప్రజాశక్తి – యంత్రాంగం : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పార్వతీపురం మన్యం, తూర్పుగోదారి, ఏలూరు, తిరుపతిలో భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం గంటపాటు కురిసింది. బలమైన ఈదురుగాలులకు పలు చెట్లు నెలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో పిడుగుపాటుకు ఒకరు మరణించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పలుచోట్ల ఉరుములకు కూడిన వర్షం కురిసింది. వీరఘట్టం మండంలో భారీ ఈదురుగాలులు వీశాయి. విజయనగరం జిల్లా వేపాడ, ఎస్‌.కోట మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం, కడియం, ఆలమూరు, కొవ్వూరు, నిడదవోలు, రామచంద్రపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో గంటపాటు వర్షం పడింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రామన్నపాలెం గ్రామంలోని కరెంట్‌ స్తంభం నెలకొరగడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తిరుపతిలోపలు మండలల్లో చిరు జల్లులు పడ్డాయి. కృష్ణా జిల్లాలో 25 మండలాలకుగాను 19 మండలాల్లో వర్షం కురిసింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు) జిల్లావ్యాప్తంగా 278.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున ఒక్కో మండలంలో 11.1 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఉంగుటూరు మండలంలో 36.2 మిల్లీమీటర్లు, 15.2, గుడివాడలో 15.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
తిరుపతి జిల్లా పుత్తూరు రూరల్‌ మండలం కృష్ణసముద్రం గ్రామానికి చెందిన సి.అన్బుకుమార్‌ (45) తమ ఆవులను గ్రామ సమీపంలోని చెరువు వద్ద మేపుతుండగా ఆయనకు సమీపంలో పిడుగుపడింది. దీంతో అన్బుకుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన తోటి కాపరులు వెంటనే ఆయనను నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

➡️