టిడ్కో ఇళ్లు అప్పగించకుండానే వడ్డీలా? :  ఎమ్మెల్యే వేగుళ్లు జోగేశ్వరరావు

Feb 12,2024 21:02 #muncipal, #ofice dharna
  •  లబ్ధిదారులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా

ప్రజాశక్తి – మండపేట(డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : టిడ్కో ఇళ్లను అప్పగించకుండానే బ్యాంకు వడ్డీ ఎందుకు కట్టాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి సోమవారం ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వడ్డీ కట్టాలంటూ టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు పంపించాయన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో లబ్ధిదారులు ప్లాట్లు స్వాధీనం చేసుకునే వరకు వడ్డీ కట్టక్కరలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని డిమాండ్‌ చేశారు. ఫ్లాట్ల కోసం ఏడేళ్ల క్రితం ఒక్కొక్కరూ రూ లక్ష చెల్లించారని, వాటిని నేటికీ అప్పగించలేదన్నారు. టిడ్కో ఫ్లాట్లు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలను ప్రభుత్వం తీసుకుందన్నారు. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయీ చెల్లించలేదని, ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని? ఆయన ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసుకోవడంలో చూపిన శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో లేదని విమర్శించారు. కమీషనర్‌ ఇచ్చిన హామీ మేరకు మిగిలిన ఫ్లాట్లను వారం రోజుల్లో అప్పగించి బ్యాంకు రుణాల వడ్డీ ప్రభుత్వమే భరించాలని లేదా మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, టిడిపి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️