హీరో యశ్‌ పుట్టినరోజున విషాదం.. బ్యానర్‌ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి

అమరావతి : కన్నడ స్టార్‌ హీరో యశ్‌ పుట్టినరోజున తీవ్ర విషాదం నెలకొంది. తమ హీరో బ్యానర్‌ను కట్టే సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు అభిమానులు మృతి చెందారు.

నేడు హీరో యష్‌ పుట్టినరోజు సందర్భంగా … గదగ్‌ జిల్లా లక్ష్మేశ్వర్‌ తాలూకాలోని సురంగి గ్రామంలో అభిమానులు బ్యానర్‌ను ఏర్పాటు చేస్తుండగా, ముగ్గురు అభిమానులు కరెంటు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. వీరితోపాటు ఉన్న మంజునాథ్‌ హరిజన్‌, ప్రకాష్‌ మాగేరి, దీపక హరిజన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హనమంత హరిజన్‌ (21), మురళీ నాదవినమణి (20), నవీన్‌ గాజి (19)లుగా గుర్తించారు. అయితే చనిపోయిన అభిమానుల కుటుంబాలను యశ్‌ పరామర్శించాలని అక్కడి అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. తనకోసం ప్రాణాలు పోగొట్టుకున్న తమ స్నేహితుల కుటుంబాలను యశ్‌ ఓదార్చాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చంద్రులమాని ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. యశ్‌ ప్రస్తుతం షూటింగ్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. అభిమానులతో కలిసి ఈసారి పుట్టిన రోజును జరుపుకోలేనని యశ్‌ ముందుగానే తెలిపారు.

➡️