dsc: గిరిజన ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలి :  ఆదివాసీ గిరిజన సంఘం

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) : గిరిజన ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోతా రామారావు, కె.సురేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వారు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన టిడిపి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గిరిజన నిరుద్యోగ యువతీ యువకులతో ప్రత్యేక డిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం జిఒ నెంబర్‌ 3 పున:రుద్ధరణ చేయకుండా ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిఒ 3 అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో 16,350 పోస్టులలో మెగా డిఎస్‌సి ప్రకటించిందని, దీన్ని ఆదివాసీ గిరిజన సంఘం స్వాగతిస్తోందని తెలిపారు. గిరిజన ప్రత్యేక డిఎస్‌సికి కూడా నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటికీ మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ఐదేళ్లపాటు ఐటిడిఎ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️