భువనగిరి ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Feb 4,2024 12:45 #hydrabad, #studens, #suside

హైదరాబాద్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ బాలికల వసతి గహంలో విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు వసతి గృహంలో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన బాలికలు (భవ్య, వైష్ణవి) హాస్టల్‌లో ఉంటూ రెడ్డివాడ గర్ల్స్‌ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్నారు. శనివారం స్కూలుకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం హాస్టల్‌కు తిరిగి వచ్చారు. హాస్టల్‌లోనే నిర్వహిస్తున్న ట్యూషన్‌కు వెళ్లకుండా రూమ్‌లోనే ఉండిపోయారు. రాత్రి భోజనం చేశాక వస్తామంటూ ట్యూషన్‌ టీచర్‌కు చెప్పారు. అయితే, భోజనం చేయడానికీ వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని వెళ్లి చూడగా.. గదిలోని రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే విద్యార్థినులు, టీచర్‌ వారిని కిందికి దించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, విద్యార్థినులు ఇద్దరూ అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు.

  • సూసైడ్‌ లెటర్‌..

‘ఏ తప్పూ చేయకున్నా అందరూ మమ్మల్ని మాటలంటుంటే తట్టుకోలేకపోతున్నాం.. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక పోయాం. మా శైలజ మేడం తప్ప ఎవరూ మమ్మల్ని నమ్మలేదు. అందుకే వెళ్లిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఒకేచోట సమాధి చేయండి’ అంటూ లేఖ రాసి పదో తరగతి విద్యార్థినులు ఇద్దరు హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థినుల మతిపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్‌ శైలజ, ట్యూషన్‌ టీచర్‌ లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన

మృతదేహాల వద్ద దొరికిన లేఖ తమ పిల్లలు రాసింది కాదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల మృతదేహాలతో వారు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి ఆదివారం హాస్టల్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో భువనగిరి ఎస్సీ హాస్టల్‌ ముందు ఉద్రిక్తత నెలకొంది.

➡️