శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది

Apr 9,2024 21:05 #Tirumala, #ttd, #Ugadi celebrations

ప్రజాశక్తి – తిరుమల, శ్రీశైలం : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయం వెలుపల ఇఒ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌, డిఎల్‌ఒ వీర్రాజు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఇఒ లోకనాథం, విజిఒ నంద కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.
విశేషంగా ఆకట్టుకున్న ఫల – పుష్ప అలంకరణలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం పది టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్‌ఫ్లవర్స్‌ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు, విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయోధ్య రామాలయం, బాల రాముడి సెట్టింగ్‌, నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారం యాత్రికులను ఆకర్షించాయి.
వైభవంగా శ్రీశైల మల్లన్న రథోత్సవం
శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవం ముందుభాగాన్న కోలాటం, చెక్కభజన, పగటివేషాల ప్రదర్శన, బుట్ట బొమ్మలు, గొరవయ్య నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్‌ వీరగాసి కొమ్ము వాయిద్యం, కన్నడ డోలు, నంది కోలు సేవ కంచుడోలు, వంటి వివిధ రకాల నృత్య ప్రదర్శనలతో క్షేత్రంలోని రథశాల వద్ద నుంచి నంది గుడి వరకు, తిరిగి నంది గుడి నుంచి రథశాల వరకు లక్షలాది మంది యాత్రికుల నడుమ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎస్‌పి కె.రఘువీరారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

➡️