అన్నమయ్యలో అసంతృప్తి సెగలు

Apr 14,2024 00:05

టిడిపికి తప్పని తిరుగుబాటు బెడద
ప్రజాశక్తి-కడప ప్రతినిధి:అన్నమయ్య జిల్లా ఆరు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాన్ని కలిగి ఉంది. రాయచోటి అసెంబ్లీ బరిలో వైసిపి తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టిడిపి నుంచి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరుపున అల్లాబకాష్‌ పోటీ పడుతున్నారు. రాయచోటి అసెంబ్లీలో 2.50 లక్షల ఓటర్లలో సుమారు లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. టిడిపి అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి బక్రీద్‌ పండుగ సందర్భంగా విహెచ్‌పి కార్యకర్తలకు మద్దతుగా ఒంటెలను రానివ్వక పోవడం వంటి చేష్టలతో ముస్లిం ఓటర్లలో విముఖతను ఎదుర్కొంటున్నారు. రాయచోటి టిడిపి ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డికి టికెట్‌ లభించలేదు. ఫలితంగా ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ మారితే లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో గణనీయ ప్రభావం పడనుంది. రాజంపేటలో వైసిపి తరుపున జడ్పీ చైర్మన్‌ అకేపాటి అమరనాధరెడ్డి, కూటమి తరుపున టిడిపి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించాల్సి ఉంది. టిడిపి టికెట్‌ కేటాయింపులో గందరగోళం నెలకొంది. టిడిపి ఇన్‌ఛార్జి బత్యాలకు టికెట్‌ ఇవ్వకపోవడం, పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రచారం సాగిన సుగవాసి బాలసుబ్రమణ్యానికి అసెంబ్లీ టికెట్‌ కేటాయించడం అసంతృప్తుల్ని రాజేస్తోంది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రైల్వేకోడూరు రిజర్వుడ్‌ స్థానంలో వైసిపి తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కూటమి తరుపున జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్‌, కాంగ్రెస్‌ టికెట్‌ గోశాలాదేవి పోటీ చేయనున్నారు. రైల్వేకోడూరు కూటమి అభ్యర్థికి ముక్కా రూపానందరెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి సీనియర్‌ నాయకులు కస్తూరి విశ్వనాధనాయుడు నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
చిత్తూరులో మూడు
మదనపల్లిలో వైసిపి నుంచి కొత్త అభ్యర్థి నిస్సార్‌ అహ్మద్‌, టిడిపి తరుపున మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, కాంగ్రెస్‌ నుంచి పవన్‌ కుమార్‌రెడ్డి పోటీ చేయనున్నారు. వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పీలేరులో వైసిపి తరుపున చింతల రామచంద్రారెడ్డి, టిడిపి తరుపున నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సోమశేఖర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టిడిపి తరుపున పోటీ పడుతున్న నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తంబళ్లపల్లిలో వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, టిడిపి తరుపున జయచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఎం.ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. వైసిపి, టిడిపి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
రాజంపేటలో మాజీ సిఎం
రాజంపేట లోక్‌సభ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, కూటమి తరుపున బిజెపి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేసి ఓటమి పాలు కావడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్‌ బరిలో స్థానికుడిని బరిలో నిలపాలనే ఉద్దేశంతో పీలేరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిని బరిలో నిలిపినట్లు తెలుస్తోంది. పీలేరు అసెంబ్లీ సొంత నియోజకవర్గం కావడం, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో స్వంత సామాజిక వర్గంలో పలుకుబడిని కలిగి ఉండడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి సైతం పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో తండ్రి, పినతండ్రులు పోటీ చేస్తుండడం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

➡️