గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : వి శ్రీనివాసరావు

Apr 20,2024 22:39 #cpm, #Gangavaram port, #V.Srinivas rao

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. వేతనం పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదానీ గంగవరం పోర్టులో కార్మికులు చేస్తున్న ఆందోళన శనివారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారి పోరాటానికి శ్రీనివాసరావు మద్దతు తెలిపి మాట్లాడారు. ఒక సంవత్సరంలో రూ.800 కోట్ల నికర లాభాలు సంపాదించిందంటే అది కార్మికుల చెమటవల్లేనన్నారు. అటువంటి కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అదానీకి భారతదేశ చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. పోర్టు యాజమాన్యం పోలీసుల మాటగానీ, కలెక్టర్‌ మాటగానీ, అధికారుల మాటగానీ వినడం లేదన్నారు. అటువంటి పోర్టు యజమాని మెడలు వంచకపోతే ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీకోసమే మేమున్నామంటూ మాటలు చెప్పే నాయకులు కార్మికుల ఉద్యమాన్ని బలహీనపరచడానికి ఎన్నికల కోడ్‌ ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. గంగవరం పోర్టు వల్ల ఈ ప్రాంత ప్రజలు నిర్వాసితుల య్యారని, సముద్ర వేట, ఉపాధి కోల్పోయారని గుర్తుచేశారు. ఇంతటి త్యాగం చేసిన వారికి కనీసం బతకడానికి కూడా తగిన జీతాలు చెల్లించక పోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా యాజ మాన్యం కార్మికులతో చర్చలు జరిపి రూ.36 వేల వేతనం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోర్టు స్తంభించడం వల్ల వచ్చిన నష్టానికి, దుష్ఫలితాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతోనే అదానీ యాజమాన్యం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, గంగవరం పోర్టు ఎంప్లాయీ స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు, నాయకులు కొవిరి అప్పలరాజు పాల్గొన్నారు.

➡️