స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

visakha-steel-plant manganese mines

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాలతో కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు బిఎస్‌.రావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1169వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఆర్‌ఎంహెచ్‌పి విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు విశాఖకు వస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. విశాఖ రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలను కేంద్రంలోని బిజెపి సర్కారు విస్మరించిందన్నారు. దానిని ప్రశ్నించే సాహసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు చేయడం లేదన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పాటుపడని పార్టీలు కూడా నేడు ఓట్లు అడగడానికి వస్తున్నాయని, ప్రజలు అటువంటి వారిని తిరస్కరించాలని కోరారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేసే వారికి బుద్ధిచెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షల్లో నాయకులు ఎంవి.రమణ శ్రీనివాస్‌, ఎన్నేటి రమణ, దాసరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️