ఇంటి వద్ద నుంచే ఓటింగు

  •  విస్తృత ప్రచారం చేయని ఇసి
  •  ఓటర్లకు తెలియని దరఖాస్తు విధానం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఇసి వీలు కల్పించింది. తొలిసారిగా 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. హోమ్‌ ఓటింగ్‌ విధానంపై ఓటర్లు ఆశించిన స్థాయిలో ఇసి విస్తృత ప్రచారం కల్పించలేకపోయింది. ఫలితంగా ఓటింగు నామమాత్రంగా నమోదవుతోంది. రాష్ట్రంలో 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవైకల్యం పైబడిన వికలాంగులకు హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్ద ఓటింగు విధానానికి 7,28,484 మంది అర్హులున్నారు. వీరిలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు 2,11,257 మంది ఉండగా, కేవలం 14,577 మంది ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని ఎన్నుకున్నారు. వీరుకాక అంగవైకల్యం ఉన్న ఓటర్లు 5,17,227 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇందులో కేవలం 28,591 మంది ఈ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.

హోమ్‌ ఓటింగు దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ అంతా బూత్‌ లెవల్‌ ఆఫీసరు (బిఎల్‌ఒ) నేతృత్వంలోని సిబ్బంది నిర్వహిస్తారు. 85 ఏళ్లు దాటిన వారు, 40 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సదరమ్‌ సర్టిఫికెట్‌ ఉన్న ఓటర్లు ఈ ప్రక్రియ ద్వారా ఇంటి వద్ద నుంచే ఓటింగులో పాల్గోవొచ్చు. తాము పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలా? లేక ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలా అనేది ఆ ఓటరుదే నిర్ణయం. హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించి అధికారులకు ఇసి మార్గనిర్దేశనం చేసింది. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడేవారు ఆయా బూత్‌లెవల్‌ ఆఫీసరు పరిధిలో ఎంతమంది ఉన్నారనేది తొలుత బిఎల్‌ఒ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గుర్తిస్తారు. అనంతరం ఆ ఓటరు ఉన్న ఇంటిని బిఎల్‌ఒ, సిబ్బందితో కలిసి సందర్శించి ఫారం-12-డి (హోమ్‌ ఓటింగ్‌కు అంగీరిస్తున్నట్లు)పై ఓటరుతో సంతకం చేయిస్తారు. అనంతరం రెండో విడతలో ఆయా ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బిఎల్‌ఒ బ్యాలెట్‌తోపాటు బ్యాలెట్‌ బాక్స్‌ ఆయా ఓటర్ల ఇంటికి తీసుకెళ్తారు. ఓటు హక్కు ప్రక్రియ అంతా ఎన్నికల సంఘం వీడియోగ్రఫీ చేస్తుంది. ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం బ్యాలెట్‌ బాక్సులను బిఎల్‌ఒల పరిధిలోని రిటర్నింగ్‌ ఆఫీసరు కార్యాలయానికి తరలిస్తారు.

సామాన్యులకు అర్థం కాని హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ
ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే విధానం గురించి ఎన్నికల కమిషన్‌ విస్తృత ప్రచారం కల్పించలేదు. బిఎల్‌ఒలు కూడా ఈ ప్రక్రియను అంత సీరియస్‌గా తీసుకోలేదు. అత్యధిక శాతం ఓటర్లకు ఈ సౌకర్యం ఉన్న సంగతే తెలియదు. ఫలితంగా ఎక్కువ మంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఈ నెల 2 నుంచి ఎన్నికల కమిషన్‌ ప్రారంభించింది. ఈ నెల 8 వరకు కొనసాగనుంది.

ఓటర్లపై ఒత్తిళ్లు..!
ఇంటి వద్ద నుంచి ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లపై రాజకీయ పార్టీల నేతల ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో అనేక మంది వృద్ధులు, వికలాంగులు ఈ విధానంలో ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికార బృందాలు కూడా ఈ కార్యక్రమాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ హోమ్‌ ఓటింగ్‌ విధానం గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించడంలో ఇసి కేవలం ప్రెస్‌మీట్లలో చెప్పడం మినహా గ్రామాల్లో పెద్దయెత్తున ప్రచారం నిర్వహించకుండా, మొక్కుబడి తంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందనే విమర్శలు వస్తున్నాయి.

➡️