చెరకు రైతులను ఆదుకుంటాం

  • ముస్లింల భద్రతకు కూటమి భరోసా
  • పొన్నూరు, తునిలో పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి – యంత్రాంగం : తాండవ సుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి చెరకు రైతులను ఆదుకుంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, సాగు, తాగునీరు, విద్యా, వైద్య ఉపాధి అవకాశాల కల్పనకు ముఖ్యంగా శాంతిభద్ర పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఐలాండ్‌ సెంటర్‌, కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్‌ ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో ధర్మానిదే విజయమని, కూటమి విజయం తథ్యమని అన్నారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని మొదటి నుంచి చెబుతున్నది, టిడిపికి గుడ్డిగా అధికారం కట్టబెట్టడానికి కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవష్యత్‌ కోసమేనని అన్నారు. ఎర్రమట్టి విక్రయం ద్వారా రూ.రెండువేల కోట్లు, కొనుగోలు కేంద్రాల్లోనూ రైతుల నుంచి రూ.25 కోట్లు దండుకున్న ఘనత ఉమ్మారెడ్డి కుటుంబీకులకే దక్కుతుందని విమర్శించారు. దేశమంతా డిజిటల్‌ యుగం కొనసాగుతుంటే, ఒక్క మద్యం విక్రయాలకు మాత్రం డిజిటల్‌ పేమెంట్లు లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వైసిపి ఎంపి మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కుంభకోణంలో పాత్రదారులని ఆరోపించారు. జగన్‌ నిరంకుశత్వాన్ని భరించలేక అంబటి రాయుడు ఆ పార్టీ నుండి బయటకు వచ్చారని, ఆయన బాధ్యత, భవిష్యత్‌ జనసేనదేనని చెప్పారు. దళిత యువకుడు బర్నబాస్‌ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, వారి భద్రతకు కూటమి భరోసా కల్పిస్తుందని అన్నారు. పొన్నూరులో తమలపాకుల రైతుల సమస్యలు పరిష్కరించాలని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ హరిబాబు తీసుకువచ్చారు. తాండవ నది ఇసుకను స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ నిధులను భవన నిర్మాణ కార్మికులకు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళితులకు రక్షణ కరువైందన్నారు. ఓటమి భయంతోనే సిఎం రమేష్‌, బాలసౌరి మీద వైసిపి దాడులు చేయించిందన్నారు.

➡️