20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం..

May 1,2024 00:58 #Nara Lokesh, #TDP, #Yuvagalam
  •  యువగళం సభలో నారా లోకేష్‌

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన యువగళం సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, పలు పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు పొందిందన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నాశనం చేసిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, దీంతో కూటమివి అలవికాని హామీలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. అనంతరం యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. ‘చిత్తూరుకు ఎలక్ట్రానిక్‌ మానుఫ్యాక్టరింగ్‌, కర్నూలుకు రెన్యూవబుల్‌ ఎనర్జీ పరిశ్రమలు తీసుకువచ్చాం. చంద్రబాబు బ్రాండ్‌ విలువ నాకు తెలుసు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రజల కోసం పోరాడిన నాపై 23 కేసులు పెట్టారు. అనేకసార్లు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. జిఒ నెంబర్‌ 1 తీసుకొచ్చి పాదయాత్రలో మైక్‌ పట్టుకుని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. తప్పు చేసిన అధికారులపై న్యాయవిచారణ చేసి జైలుకు పంపిస్తాం’ అని అన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నేతలు పాల్గొన్నారు.

➡️