అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

Dec 30,2023 09:12 #Nara Chandrababu, #speech

-దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం

ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, కుప్పం:’మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం’ అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన శాంతిపురం మండలంలో రోడ్డు షో నిర్వహించారు. శాంతిపురంలో అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్దకు వచ్చి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అన్నారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలతోపాటు రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసగించారని విమర్శించారు. మళ్లీ ఆయనకు అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు కోరారు. నాలుగు వేల రూపాయలు ఉన్న అంగన్‌వాడీ వర్కర్ల వేతనాన్ని రూ.10,500కు పెంచిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ముద్దులు పెట్టడం, తల నిమరడం చేసి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకూ ప్రభుత్వంతో పోరాడాలని, ఈ ప్రభుత్వం చేయకపోతే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు విజ్ఞాపన పత్రం అందజేశారు.

➡️