మద్యపాన నిషేధమెక్కడ..?

  • బిజెపితో చంద్రబాబుది బహిరంగ పొత్తు
  •  చిత్తూరు జిల్లాలో వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి – వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి తీసుకొచ్చారని పిసిసి అధ్యక్షులు వైస్‌ షర్మిల విమర్శించారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. బిజెపితో చంద్రబాబుది బహిరంగ పొత్తని, జగన్‌మోహన్‌రెడ్డిది రహస్య తొత్తు అని విమర్శించారు. ఆమె చేపట్టిన బస్సు యాత్ర సోమవారం చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాల్లో సాగింది. ఆయా చోట్ల వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతే రాజు అని వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేవాళ్లని, జగన్‌ పాలనలో కనీసం డ్రిప్‌ పరికరాలపై సబ్సిడీ కూడా లేదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. ఎన్నికల ముంగిట హడావుడిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రక్రియ ఎలాగూ పూర్తవ్వదని సిఎంకు తెలుసని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మూతబడిన చెరకు ఫ్యాక్టరీలను పునఃప్రారంభిస్తామని, చెరకు సాగుకు పెద్దపీట వేస్తామని, ఇల్లులేని పేద కుటుంబాలకు ఐదు రూ. లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గోవర్థ్ధన్‌రెడ్డి, గౌతమ్‌రాజు, కిషన్‌ పాల్గొన్నారు.

➡️