పట్టాదారు పుస్తకంపై జగన్‌ ఫోటో ఎందుకు? : చంద్రబాబు

May 4,2024 17:15 #chandrababau, #speech

అమరావతి : ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. పట్టాదారు పుస్తకాలపై జగన్‌ ఫోటో ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటి ప్రతిని చంద్రబాబు చింపేశారు.
నవరత్నాల పేరిట అనేక మోసాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్‌పై మండిపడ్డారు. ప్రజల భూములను జగన్‌ దగ్గర పెట్టుకోవడం అంటే జగన్‌ చేతికి ఉరితాడును అప్పగించినట్లేనని విమర్శించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించి పనిచేశామని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేస్తే జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 10 శాతం మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని జగన్‌ వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియా, జే బ్రాండ్‌ మద్యం, భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తుల కబ్జా, ఎర్రచందనం, గంజాయి,దాడులు , శవరాజకీయాలతో నాటకం ఆడుతుందని విమర్శించారు.

➡️