‘ మీకెందుకు జీతాలు పెంచాలి ‘ అంగన్వాడీలపై దుర్భాషలాడిన వ్యక్తి… చివరకు…!

Jan 14,2024 13:39 #abused, #Anganwadis, #Finally, #man, #salaries

ఒంగోలు : అంగన్వాడీ కార్యకర్తలపై అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడిన వ్యక్తిపై అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం జరిగింది. నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి శిబిరం వద్దకు వచ్చాడు. అంగన్‌వాడీలనుద్దేశించి మీకెందుకు జీతాలు పెంచాలంటూ దుర్భాషలాడారు.

” మీరు చదివింది పదో తరగతే. అయినా మీకు ప్రభుత్వం రూ.11,500 ఇస్తోంది. అదే చాలా ఎక్కువ. ఇంకా జీతాలు పెంచాలంటూ ధర్నాలు, సమ్మెలు చేయడం ఎందుకు…” అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలనుద్దేశించి అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడాడు. దీంతో కార్యకర్తలు, ఆయాలు అతన్ని చుట్టుముట్టి తమ సమస్యలు మీకేం తెలుసని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా తాము ఆందోళన చేస్తుంటే మీకేం నష్టమంటూ ప్రశ్నించారు. దీంతో అతను వారికి దండం పెట్టి మన్నించాలని కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అతని చిరునామా గురించి ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కార్యకర్తలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి దీక్షలకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

➡️