స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై స్పందించరేం ?

Feb 20,2024 08:48 #Nara Lokesh, #TDP
  • నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు
  • రెక్కలు లేని ఫ్యాన్‌ను చెత్తబుట్టలో వేయండి
  • శంఖారావం సభల్లో నారా లోకేష్‌

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, గాజువాక, సీతమ్మధార, బుచ్చయ్యపేట విలేకరులు : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంలో సిఎం జగన్‌ స్పందించడం లేదని, ఉమ్మడి విశాఖలోని ఇతర సమస్యలూ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. టిడిపి శంఖారావం సభలు సోమవారం విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో జరిగాయి. ఆయా చోట్ల పార్టీ కార్యకర్తలనుద్దేశించి లోకేష్‌ మాట్లాడారు. నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవమోసాలు చేశారని మండిపడ్డారు. వైసిపి పాలనలో అన్ని తరగతుల వారు ఉపాధి కోల్పోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో రెక్కలు లేని ఫ్యాన్‌ను చెత్తబుట్టలో వేయాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన తొమ్మిది హామీల్లో మద్యపాన నిషేధం ఎక్కడైనా అమలైందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తగా ఎకరం భూమికి కూడా వైసిపి ప్రభుత్వం సాగునీరందించలేదని విమర్శించారు. పరిపాలనా రాజధాని పేర విశాఖలో భూ దందాలు చేస్తున్నారని, ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్‌డి పోస్టులు అమ్ముకుంటున్న విసి ప్రసాదరెడ్డి పేరు రెడ్‌బుక్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక విసిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీటిని కుళాయి ద్వారా సరఫరా చేస్తామని, అనకాపల్లి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశారని వ్యాఖ్యానించారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నాయకులు పల్లా శ్రీనివాసరావు, శ్రీభరత్‌, బుద్ధ నాగజగదీశ్వరరావు, పీలా గోవింద సత్యనారాయణ, దాడి వీరభద్రరావు, జనసేన పార్టీ నాయకులు పంచకర్ల రమేష్‌బాబు, కోన తాతారావు, ఉషాకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️