వైసిపి చాప చుట్టేయడం ఖాయం : మాజీ ఎమ్మెల్యే యరపతినేని

Jan 18,2024 10:39 #Former MLA Yarapatineni, #TDP

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో వైసిపి చాపచుట్టేయడం ఖాయమని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడారు. అన్ని తరగతుల ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధి పథంలోఉన్న రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. భావితరాల పిల్లలకు రాజధాని ఎక్కడో చెప్పలేని దుస్థితిని కల్పించారని అన్నారు. కేవలం బటన్‌ నొక్కి కొంతమందికి డబ్బులు జమ చేస్తే సరిపోతుందా? రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సిఎం జగన్‌ ఎప్పుడయినా జనంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. పేదలు నిరుపేదలుగా మారారని చెప్పారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి రాని దౌర్భాగ్యపు సిఎం ఎక్కడా లేరన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసి విశాఖపట్నంలో రూ.500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన భవంతి అవసరమా అని ప్రశ్నించారు. నాసిరకం మద్యం అమ్మించి ఎంతో మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. టిటిడి డబ్బుతో జగన్‌ ఇంట్లో సంక్రాంతి వేడుకల సెట్టింగ్‌ ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు అపాయిమెంట్‌ ఇవ్వకుండా తన కోటరి ద్వారా వారి టికెట్లు నిర్ధారిస్తున్నారని విమర్శించారు. ప్రజలను కలవకుండా వారి సమస్యలను తెలుసుకోకుండా జగన్‌ చేసే పరిపాలన దేశంలోనే ఒక రికార్డు అని ఎద్దేవా చేశారు.

➡️