ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందని, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందన్నారు. దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై, అధికార పార్టీకి కొమ్మకాస్తున్న కొందరు పోలీసుల అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలన్నారు. మోహన్ రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జ్యోతిరావ్‌ పూలేకు నివాళి :

సమసమాజ స్థాపనకు స్ఫూర్తిప్రదాత, మహాత్మా జ్యోతిరావ్‌ పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే. ఆయన స్పూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4,000ల పింఛన్ ఇస్తాం…1 లక్ష 50 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం… బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్ళలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం… వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తాం… చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి, పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం .. పెళ్లి కానుక రూ.1 లక్షకు పెంచుతాం… స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం… చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం… బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాం…. బీసీల కోసం ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఫూలే ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తాం” అని పేర్కొన్నారు.

 

➡️