జమ్ముకాశ్మీర్‌ బిల్లుకు వైసిపి మద్దతు హానికరం- సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Dec 13,2023 08:43 #cpm, #prakatana

ప్రజాశక్తి -అమరావతి బ్యూరోరాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర నిరంకుశత్వాన్ని రుద్దుతున్న జమ్ముకాశ్మీర్‌ బిల్లులను వైసిపి పార్లమెంట్లో బలపరచడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర అప్రజాస్వామిక బిల్లులను బలపరచడమే కాకుండా మొత్తం కాశ్మీర్‌ చరిత్రనే వక్రీకరించి ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనను పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి వినిపించారని తెలిపారు. బిజెపి ముస్లిం వ్యతిరేకతను గుడ్డిగా విజయసాయిరెడ్డి కూడా తలకెక్కించుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇది దేశ చరిత్రను, స్వాతంత్య్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమేనని, జమ్ముకాశ్మీర్‌ బిల్ల్లులో అసెంబ్లీలో నామినేషన్‌ పద్ధతి ద్వారా కేంద్రమే ఎమ్మెల్యేలను నియమిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ప్రజా తీర్పులను అపహాస్యం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రాల అసెంబ్లీలకు శాసనసభ్యులను నామినేషన్‌ చేయడం రాష్ట్ర ప్రభుత్వాల హక్కుగా ఉందని, ఈ చట్టం ద్వారా కేంద్రానికి బదలాయించుకుందని మొత్తం ప్రజాస్వామ్య విలువలను, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రం తీరు ఉందని తెలిపారు. ఈ బిల్లులను పార్లమెంట్లో విజయసాయిరెడ్డి వెనకేసుకురావడం హానికరమని విమర్శించారు. జమ్ముకాశ్మీర్‌ శరణార్థుల గురించి మాట్లాడే సమయంలో రాజా హరిసింగ్‌ను ఆయన కొనియాడటం చరిత్రను వక్రీకరించడమేనని, రాజా హరిసింగ్‌ తొలుత స్వతంత్ర కాశ్మీర్‌ను ప్రకటించుకున్నారని తెలిపారు. ఆయన మూలంగానే ఆక్రమిత కాశ్మీరు (పిఒకె) పాకిస్తాన్‌కు వెళ్లిపోయిందని వివరించారు. అనంతరమే కాశ్మీర్‌ భారతదేశంలో విలీనమైందని, షేక్‌ అబ్దుల్లా ప్రజలను కూడగట్టి జమ్ముకాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో కలవకుండా భారతదేశంలో కలిసినందుకు వారి ప్రత్యేక హక్కులు కొన్నిటిని గుర్తిస్తూ 370 ఆర్టికల్‌ రాజ్యాంగంలో చేర్చారని వివరించారు. ఈ వాస్తవాలు ఏమీ విజయసాయిరెడ్డి గుర్తించకపోవడం అన్యాయమని తెలిపారు. పురాతన చరిత్రలో జరిగిన ఘోరాలు పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ వక్రీకరించిన చరిత్రను విజయసాయిరెడ్డి వల్లె వేయడం వైసిపి స్వభావాన్ని ప్రశ్నిస్తోందని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పార్లమెంటులో వైసిపి గట్టిగా నిలబడాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కృషి చేయాలని, బిజెపికి వంత పాడటం మానుకుని ప్రజల తరఫున నిలబడాలని కోరారు.

➡️