లోకేష్‌ యువగళం నేటితో ముగింపు

yuvagalam padayatra public meeting

225 రోజుల్లో 3132 కిలోమీటర్లు సాగిన యాత్ర
20న విజయనగరంలో విజయోత్సవ సభ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారంతో ముగియనుంది. జనవరి 27వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు సాగింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యాత్ర సాగించాలని ముందుగా టిడిపి భావించింది. ఈ ప్రకారం వచ్చే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో ముగించాల్సి ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సెప్టెంబర్‌ 9వ తేదితో యాత్ర నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్‌పై వచ్చిన తరువాత నవంబర్‌ 27 నుంచి తిరిగి ప్రారంభించారు. సుమారు 80 రోజుల పాటు యాత్ర సాగలేదు. మరోపక్క ఎన్నికల సమయం దగ్గర పడటంతో యాత్రను వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవేశించకుండానే యాత్ర ముగియనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకను అవుతానని లోకేష్‌ యాత్ర ప్రారంభానికి ముందు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అధికార పార్టీ నేతలపై విమర్శల దాడి చేశారు. అదేవిధంగా యాత్రలో పలు సమస్యలపై అధికార యంత్రాంగానికి 600పైగా లేఖలు రాశారు. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడి ఉన్న సమస్యను అధికారంలోకి రాగనే పూర్తిచేస్తానని శిలఫలాకలతో లోకేష్‌ హామీ ఇచ్చారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్‌ పాల్గని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. భారీ స్థాయిలో ముగింపు సభయువగళం విజయోత్సవ సభను టిడిపి భారీస్థాయిలో నిర్వహించనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20వ తేది విజయోత్సవ సభను జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్‌, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను టిడిపి సిద్ధం చేసింది. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గంటారు.

➡️