ఎన్నికల వేళ ఉల్లి స్టంట్‌

May 4,2024 21:06 #Business, #Exports, #onion
  • ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ : దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్రలో ఉల్లి రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్తాయికి చేరింది. ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలని చాలా రోజుల నుంచి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో రైతుల నుంచి తీవ్ర నష్టం జరగొచ్చని బిజెపి సర్కార్‌ భావించినట్లుంది. ఉల్లి ఎగుమతులపై 2023 డిసెంబర్‌ 8 నుంచి నిషేధం ఉంది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తొలుత ప్రభుత్వం పేర్కొంది. ఆ గడువును మళ్లీ పొడిగించగా.. తాజాగా ఎత్తివేసింది.
ఇప్పటికిప్పుడు వాణిజ్య శాఖ దీన్ని ఎత్తివేయడంతో ఇది ఎన్నికల స్టంట్‌గా నిపుణులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో తదుపరి దశ పోలింగ్‌ జరగనున్న వేళ వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మెట్రిక్‌ టన్నుకు కనీస ఎగుమతి ధరను 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది. ఇందుకోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డిజిఎఫ్‌టి) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉంది. కాగా.. యుఎఇ, బంగ్లాదేశ్‌లకు మాత్రం పరిమితులతో కూడిన ఎగుమతులకు కేంద్రం అనుమతించింది. తాజా నిర్ణయంతో ఇకపై ప్రపంచంలోనే ఏ దేశానికి అయినా ఎగుమతి చేసుకోవడానికి వీలు కలిగింది.

➡️