అంగన్‌వాడీ కేంద్రాల ఆక్రమణ

అంగన్‌వాడీ కేంద్రాల ఆక్రమణ

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి అంగన్‌వాడీల ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధ కాండకు తెరలేపింది. అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం హ్కుల సాధన కోసం సమ్మె చేపట్టిన విషయం విదితమే. సమ్మెలో భాగంగా మూడో రోజైన గురువారం మండల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోలనలు కొనసాగాయి. అంగన్‌వాడీల ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరించింది. అంగన్‌వాడీ సిబ్బందిపై బెదిరింపు చర్యలకు పాల్పడింది. జిల్లాలోని 7 ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్‌, 26 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం 1,562 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలను సమీపంలోని సచివాయాలకు మ్యాపింగ్‌ చేయించింది. జిల్లాలో 512 సచివాలయాల్లో సిబ్బందికి బాధ్యతలను అప్పజెబుతూ తాళాలు బద్దలు కొట్టి కేంద్రాల నిర్వహణ చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేయటంతో మున్సిపాల్టీల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపిడిఒలు బాధ్యత తీసుకుని, సచివాలయ ఉద్యోగుల చేత ఈ పని చేయించారు. తాళాలు బద్దలు కొట్టే దుశ్చర్య గురువారం రాత్రి వరకూ కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు అంగన్‌వాడీ కేంద్రాల తాళం పగలగొట్టి, కేంద్రాలను తెరిచి అక్కడి ఫుడ్‌ తదితర వివరాలను పంచనామా ద్వారా రికార్డు చేశారు. పంచనామాను విఆర్‌ఒ, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు (వార్డు, గ్రామ, మహిళా సంరక్షణా కార్యదర్శి) నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 3,098 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా తమ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లతో పాటు అదనపు పౌష్టికాహారాన్ని అందిస్తూ మాతా, శిశు మరణాల రేటును తగ్గిస్తున్నారు. క్షేత్రస్థాయిలోకీలక సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయడం లేదు. ఉద్యోగ భద్రతా కల్పించడం లేదు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో సమ్మెబాట పట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలు తాళాలు పగలుకొట్టి, వాటిని తెరవడం, అక్కడ సరుకును లెక్కించి, రికార్డు చేయడంతోపాటు, పిల్లలను రప్పించి అన్నం వండి పెట్టడం వంటి అదనపు పనులన్నీ సచివాయాల సిబ్బందికి అప్పచెప్పటంతో వారిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం వైపు దష్టిపెట్టకుండా, ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించడం నియంతృత్వానికి అద్దం పడుతోందని అంగన్‌వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️