ఆశాలపై పనిభారం తగ్గించాలి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఆశాలపై పని భారం తగ్గించాలని, వారికి సంబంధం లేని పనులను చేయించొద్దని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో కమల అధ్యక్షతన జిల్లా జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోశమ్మ మాట్లాడుతూ ప్రతిరోజూ 26 రికార్డులు రాయాలని, ఆన్‌లైన్‌ పనులు చేయాలని, ఎలాంటి శిక్షణా ఇవ్వకుండా ఆశాలపై పని భారం పెంచుతున్నారని, పనిచేయని ఫోన్లు ఇచ్చి ఆన్‌లైన్‌ పనులు ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. పదివేలు జీతం ఇస్తూ రూ.20 వేల ఫోన్‌ కొనుక్కోమని, సొంత ఫోనులో పనిచేయమని అధికారులు వేధించడం దుర్మార్గమన్నారు. తక్షణం అధికారుల వేధింపులు ఆపకుంటే జిల్లా స్థాయిలో 36 గంటల ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 లేవు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ సౌకర్యాలు కల్పించాలని, వైద్య రంగానికి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, లోకేశ్వరి, కుమారి, నాగమణి, అరుణ, శిరోమణి, శాంత కుమారి, కనకదుర్గ, వరలక్ష్మి, ప్రభావతి, పోచమ్మ, మంగతాయారు పాల్గొన్నారు.

➡️