ఎన్‌ఆర్‌సిలో డిఐఒ తనిఖీలు

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : పోషకాహార పునరావాస కేంద్రం(ఎన్‌ఆర్‌సి)లో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఎన్‌ఆర్‌సిలో వివిధ ప్రాంతాల నుండి చేరిన ఐదేళ్లలోపు పిల్లలు, వారి ఆరోగ్య వివరాల రికార్డులను పరిశీలించారు. పిల్లల బరువు స్వయంగా ఆయన తనిఖీ చేశారు. ఎదుగుదల లోపం, రక్తహీనత, పోషకాహార లోపం ఇంకా ఏ విధమైన ఆరోగ్య సమస్యలున్నాయా? అని పరిశీలించారు. గతంలో అడ్మిట్‌ అయిన పిల్లలకు ఆరోగ్యం ఏ మేరకు వృద్ధి చెందిందో పరిశీలించారు. పిల్లలను తరచూ పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి సూచించారు. అక్కడున్న తల్లిదండ్రులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందజేస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో బరువు, ఎదుగుదల తక్కువగా గుర్తించిన పిల్లలను పూర్తి ఆరోగ్య వివరాలతో ఎన్‌ఆర్‌సి కేంద్రాల్లో చేర్చాలని సూచించారు. అక్కడ వారిని పది రోజుల నుండి రెండు వారాల వరకు ఉంచి వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ప్రతిరోజూ పోషకాహారం ఏడు లేదా ఎనిమిది దశల్లో అందిస్తారన్నారు. జిల్లాలో రెండు ఎన్‌ఆర్‌సిలున్నాయని, వేరొకటి సీతంపేట, ప్రాంతీయ ఆసుపత్రిలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో డిపిహెచ్‌ఎన్‌ఒ ఉషారాణి, న్యూ ట్రిషన్‌ కౌన్సిలర్‌ జ్యోతి, సిబ్బంది ఉన్నారు.

➡️