ఎన్నికల కోడ్‌తో విగ్రహాలకు ముసుగు

Mar 16,2024 22:11

 ప్రజాశక్తి -కొమరాడ : ఎన్నికల కోడ్‌ కూయడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు తొడుగుతున్నారు. మండలంలోని అధికారుల ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో ఉన్న వివిధ పార్టీ నాయకుల విగ్రహాలతో పాటు కోడ్‌ నియమ నిబంధనల్లో ఉన్న వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగమయ్యారు. జంఝావతి జంక్షన్లో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి విఆర్‌ఒ పైడితల్లి, బూత్‌ అధికారులు ముసుగులు తొడిగారు. మండలంలో పటిష్టంగా ఎన్నికల కోడ్‌ను అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తహశీల్దార్‌ రమేష్‌, ఎంపిడిఒ మల్లికార్జునరావు, ఎస్సై నీలకంఠం తెలిపారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను పాటించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సచివాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా నాయకుల ఫోటోలు, బ్యానర్లు, విగ్రహాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ పాటించలేదని ఫిర్యాదులు వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు.వీరఘట్టం : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కోడ్‌ అమల్లోకి రావడంతో రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగులు, ప్లేక్సీలకు తెల్లపేపర్లు కప్పివేశారు. పాలకొండ : నగర పంచాయతీ పరిధిలోని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పక్కాగా అమలు చేయాలని నగర పంచాయతీ కమిషనర్‌ ఎస్‌.సర్వేశ్వర్రావు అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో శనివారం సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి, సిఎం, మంత్రుల ఫొటోలు తొలిగించాలన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే రోడ్డుపై ఉన్న రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. సీతంపేట: ఎన్నికలు కోడ్‌ అమలు కావడంతో సీతంపేట సచివాలయంలో కార్యదర్శి బి సుదర్శన్‌ రావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు పోస్టర్లను తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఈ ప్రక్రియ జూన్‌లో నూతన ప్రభుత్వం కొలువు తీరిన వరకు అమలు జరుగుతుందని పేర్కొన్నారు.

➡️