ఐదో రోజు కొనసాగిన ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు

 ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన నిరాహారదీక్షలు మంగళవారం ఐదో రోజుకు చేరుకున్నారు. ఈ దీక్షలనుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఆధ్వర్యాన జరిగిన దీక్షలనుద్దేశించి వక్తలు మాట్లాడుతూ కనీస సౌకర్యాల్లేక విద్యార్థుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, కనీసం పాలక ప్రభుత్వాలు వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల్లేకపోవడం అన్యాయమని, మన్యం జిల్లా అనే పేరు పెట్టి, జిల్లా వాసులను అడవుల్లో ఉన్న జంతువుల్లా ప్రభుత్వ వర్గాలు చూస్తున్నాయని, ఇది దారుణమని ఖండిచారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు అనేక మౌలిక సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులకు పట్టడం లేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని హాస్టళ్లలో ఈనాటికీ మరుగుదొడ్లు లేక ఆరుబయటకు విద్యార్థిని, విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడం బాధాకరమని, వెంటనే అధికారులు స్పందించి మరుగుదొడ్లు, మౌలికసదుపాయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న పోరాటం చాలా అద్భుతమైందని కొనియాడారు. కార్యక్రమంలో, జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజు, కమిటీ సభ్యులు సురేష్‌, ధనుంజయరావు, ముఖేష్‌, శ్రావణ్‌, జనసేన కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️