ఓటు అందరి ప్రాథమిక హక్కు

Nov 27,2023 23:18
ఓటు

ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం అవసరం
కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌
ఓటర్లను చైతన్యం పర్చి రానున్న ఎన్నికలలో తప్పకుండా ఓటు హక్కు వినియోగించేలా అవగాహన కల్పిద్దామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పిలుపునిచ్చారు. ‘స్వీప్‌’ కార్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హర్లిక్స్‌ ఫ్యాక్టరీ నుంచి బొమ్మూరు సెంటర్‌ మీదుగా డి మార్ట్‌ వరకు బైక్‌ ర్యాలీలో చేపట్టారు. తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కియోస్కోను జెసితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఓటు హక్కు విలువ, సద్వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రతి ఏడాదీ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి కొత్తగా ఓటర్లను నమోదు చేస్తున్నారన్నారు. దీన్ని సద్వినియోగం కోరారు.జెసి ఎన్‌.తేజ్‌భరత్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నియోజక వర్గంలో జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బైక్‌ నడిపి యువతను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం.భానుప్రకాష్‌, పి.సువర్ణ, నియోజక వర్గ ఓటు నమోదు అధికారి ఎస్‌. సరళా వందనం, స్పెషల్‌ ఆఫీసర్‌ కెఎస్‌.జ్యోతి, డిఇఒ ఎస్‌.అబ్రహాం, తహశీల్దార్లు పాల్గొన్నారు.

 

➡️