కళ్లాల్లో ధాన్యం… కళ్లముందే ధైన్యం

Dec 5,2023 21:06

 ప్రజాశక్తి – జామి :  తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు జామి మండలంలో రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొంత మేరకు ధాన్యం నూర్పులు పూర్తయినప్పటికీ, ఆ ధాన్యం కళ్లాలోనే ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న వర్షాలతో ధాన్యం తడిచిపోయాయి. తాజాగా మండలంలోని తానవరం గ్రామంలో జి.అప్పల సత్యనారాయణ 350 బస్తాల ధాన్యం కళ్లంలో ఉంచగా, వర్షంతో తడిచిపోయాయి. జి.నానిబాబుకు చెందిన 300 బస్తాలు, బి.నారితల్లికి చెందిన 250 బస్తాలు, పి.రామారావుకు చెందిన 300 బస్తాలు, ఎస్‌.అప్పారావుకు చెందిన 60 బస్తాలు, శిరికి జయలక్ష్మి 75 బస్తాలు, జి.సత్యవమ్మకు చెందిన 40 బస్తాలు ధాన్యం వర్షపు నీటిలో ఉండిపోయాయి. దీంతో ధాన్యం తడిచిపోయి రంగుమారిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షంలో తడవకుండా కాపాడటానికి రైతులు వద్ద టార్పాలిన్లు కప్పి వున్నప్పటికి, వర్షం ఎక్కువ అవ్వటంతో తడిసి పోయే అవకాశం ఉందని, తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఇప్పటివరకు చర్యలు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పునరావాస చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

➡️