కెపి ఉల్లి రైతు విలవిల

ప్రజాశక్తి – చాపాడు ఉల్లి పేరు వినగానే మార్కెట్లో ఎవరి నోట విన్నా ఘాటు వినిపిస్తుంది. అయితే కృష్ణాపురం (కెపి) ఉల్లి సాగు చేసిన రైతు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉల్లి ధరలు మార్కెట్లో పర్వాలేదు అనుకుంటే పండించిన పంటను అమ్మకం చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కెపి ఉల్లి సాగు చేసిన రైతులు రూ.పది సంపాదించుకోవచ్చు అని ఆశించడం, పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చులు చేయాల్సి వస్తోంది. విత్తనాలు కిలో రూ.1000 నుంచి రూ.1500 వరకు వెచ్చించి కొనుగోలు చేసి ఎకరాకు 23 కిలోల వంతున వినియోగిస్తారు. నూర్పిడి చేసేందుకు రూ.10 వేలు ఖర్చు అవుతుంది. గతనెలలో క్వింటా రూ.8 వేలు ఉన్న ధరలు క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.2 వేలకు పడిపోయాయి. రాయలసీమకు విదేశీ మారక ద్రవ్యం తీసుకువచ్చే అతి పెద్ద పంట కెపి ఉల్లి. అలాంటి పంటకు విదేశీ ఎగుమతిలను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో అమ్మకానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానికంగా అమ్మకం చేయాలంటే దళారులు నిర్ణయించినదే ధర. మైదుకూరు కేంద్రంగా జిల్లాలోని దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లికి పలు రోగాలను నయం చేసే గుణం కలిగి ఆరోగ్యప్రదాయినిగా పేరుగాంచింది. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలో సాగైన ఉల్లిపాయలకు ఈశాన్య ఆసియా దేశాలైన సింగపూర్‌, మలేషియా, దుబారు, హాంకాంగ్‌, శ్రీలంక దేశాలలో మంచి డిమాండ్‌ ఉండేది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. మనదేశంలో వినియోగించే ఉల్లిపాయలకు, ఎగుమతుల అవసరాలకు పండించే ఉల్లిపాయలకు వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించకుండా అన్ని ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. జిల్లాలో మైదుకూరు, దువ్వూరు ఇతర ప్రాంతాలలో గతంలో పది వేల ఎకరాలకు పైగా ఉల్లి పంట సాగయ్యేది. ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం, ధరలు లేకపోవడంతో క్రమేపి తగ్గుతూ ఏడాది కేవలం 2 వేల ఎకరాలు మాత్రమే సాగైంది. రైతులు ఉల్లి పంటను ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలో సాగు చేయడం ఆనవాయితీ. ప్రారంభంలో క్వింటా కెపి ఉల్లి ధర రూ.11 వేలతో ప్రారంభమై రూ.8000 వరకు తగ్గాయి. ప్రస్తుతం రూ.2300 మాత్రమే పలుకుతున్నాయి. గతంలో మార్కెట్‌ యార్డ్‌ ద్వారా అమ్మకాలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. గతంలో రైతులు సంఘంగా ఏర్పడి మార్క్‌ఫెడ్‌ ద్వారా కెపి ఉల్లి కొనుగోలు చేయాలని నిరసనలు కూడా చేపట్టారు. మనదేశంలో వినియోగించే ఉల్లిపాయలకు ఎగుమతుల అవసరాలకు పండించే కెపి ఉల్లిపాయలకు వ్యత్యాసం ఉన్నది. ప్రభుత్వం స్పందించి కెపి ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తి వేయించి శాశ్వత కెపి ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.అమ్మకం కష్టంగా మారుతోంది ఉల్లి పంటను నూర్పిడి చేసిన తరువాత అమ్మకాలు చెపడదామంటే కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. ధరలు చాలా అధ్వాన్నంగా అడుగుతున్నారు. కెపి ఉల్లి పంటలో ఎన్నో ఏళ్లుగా సాగు చేపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించిన సందర్బంలో అమ్మకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కెపి ఉల్లి కొనుగోలు చేయాలి. – శివ చందురెడ్డి, రైతు, నాగాయపల్లె.శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి కెపి ఉల్లి మన ప్రాంతంలో మాత్రమే సాగయ్యే ప్రత్యేక రకానికి చెందినది. సాగుకు అధిక ఖర్చులు అవుతున్నాయి. అమ్మకం సమయంలో చాలా అవస్థలు పడాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ప్రభుత్వం శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సాగుకు ఆసక్తి ఉంటుంది. ధరలు నెల రోజులలోపే అమాంతంగా తగ్గిపోయాయి.- మల్లిఖార్జునరెడ్డి, చల్లబసాయపల్లె, మైదుకూరు.

➡️