కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్‌పి

Nov 30,2023 20:37

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గల ప్రాధాన్యత కలిగిన కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కలిగేలా కేసులు పరిష్కారం వేగవంతం చేయాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోకున్న కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, 174 క్రైమ్‌ పిసి కేసులు, మిస్సింగ్‌, చీటింగ్‌ కేసులు, సైబర్‌ నేరాలు, ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్‌, రికార్డులను పరిశీలించారు. కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. ఏదైనా ఒక ఫిర్యాదు నమోదైతే సంబంధిత సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆ సమస్యను సత్వరమే పరిష్కరించేలా ఎస్‌హెచ్‌ఒలు కార్యాచరణను అమలు చేయాలన్నారు. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని పాటిస్తూ పొలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు, చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్‌ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమీక్షించారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్ల వద్ద అవసరమైన వార్నింగ్‌ సిగల్‌ లైటులను, సూచిక బోర్డులను, స్టాపర్లను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. అలాగే ఎస్‌హెచ్‌ఒలు తమ పరిధిలో రహదారి భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసి రోడ్డు ప్రమాదాలు తగ్గే విధంగా మెరుగైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రాధాన్యత కేసులను అడిగి తెలుసుకొని వాటిలో శిక్షలు పడేలా చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలని సూచించారు. అక్రమ రవాణా అరికట్టడంలో, నాన్‌ బైల్‌బుల్‌ వారంట్లను జారీ చేయడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించి తరచూ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని సూచించారు. స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో, పోలీసు బృందాలతో మెరుపు దాడులు చేసి గంజాయి, నాటు సారాతో పాటు అన్ని రకాల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌, వాహనాల తనిఖీలు ఉధృతం చేయాలని ఆదేశించారు. అలాగే లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరించే అవకాశం ఉన్న అన్ని కేసులను వచ్చే నెలలో జరగబోయే లోక్‌ అదాలత్‌లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సాంకేతికంగా అవగాహన కలిగి ఉండాలని అజ్ఞాత వ్యక్తుల నుండి వచ్చే సంక్షిప్త సమాచారాలు, మెయిల్స్‌ లలోని లింకులను ఓపెన్‌ చేయకుండా తిరస్కరించాలని, పొరపాటున లింక్‌లను క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతాలో నగదు మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరైనా బాధితులు సైబర్‌ క్రైమ్‌ 1930కు గానీ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ష్ట్ర్‌్‌జూ://షybవతీషతీఱఎవ.స్త్రశీఙ.ఱఅ కు గాని వెంటనే తెలిపి సహాయం పొందాలని ఎస్పీ సూచించారు. అనంతరం ప్రాపర్టీ కేసుల్లో ముద్దాయిలను పట్టుకొని చోరీ అయిన సొత్తును రికవరీ చేసి మెరుగైన సేవలను అందించడంలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసు అధికారులను, సిబ్బంది ఎస్‌పి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. నేర సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, దిశా డిఎస్పీ ఎస్‌ఆర్‌ హర్షిత, డిఎస్‌పిలు జివి కృష్ణారావు, జి.మురళీధర్‌, ఎల్‌. శేషాద్రి, అజీజ్‌, పలువురు సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️