కోతుల కోసం అమర్చిన వలలో చిక్కిన చిరుత

వలలో చిక్కుకొని చెట్టుకు వేలాడుతున్న చిరుత

రక్షించే క్రమంలో మృత్యువాత

ప్రజాశక్తి – అడ్డతీగల

అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీ పరిధి ఎల్లవరం గ్రామ శివారు ప్రాంతంలో కోతులు కోసం రైతులు అమర్చిన వలలో చిరుత పుల్లి చిక్కింది. అయితే దానిని అటవీశాఖ అధికారులు రక్షించే ప్రయత్నం చేయగా, మృతి చెందింది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… ఎల్లవరం గ్రామ శివారు ప్రాంతంలో గురువారం ఉదయం రైతులు పొలంలోకి వెళ్తూ చెట్టుకు చిక్కి వేలాడుతున్న చిరుత పులిని చూసి భయబ్రాంతులకు గురై గ్రామంలోకి పరుగులు తీశారు. ఊరిలో అందరికీ చెప్పగా వారంతా వచ్చి పరిశీలించగా, పులి వలలో చిక్కుకుందని గుర్తించారు. వెంటనే ఫారెస్ట్‌ అధికారులకు తెలియజేయగా, అటవీ రేంజర్‌, సిబ్బంది, ఎస్సై అప్పలరాజు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విశాఖపట్నం నుండి అధికారులను రప్పించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ సహాయంతో చిరుత పులికి బకెట్లో నీళ్లు పెట్టి తాగించారు. అనంతరం దానిని నెమ్మదిగా వలతో సహా బయటకు తెచ్చి బోనులోకి పంపించారు. వెటర్నరీ డాక్టర్‌ వైద్య సేవలు అందించారు. అయితే గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో పరిస్థితి విషమించి చిరుత పులి మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో చిరుత మృతదేహానికి పంచనామ నిర్వహించి, దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డిఎఫ్‌ఒ జిజి.నరేంద్రన్‌, అడ్డతీగల సబ్‌ డిఎఫ్‌ఒ రామారావు, అటవీశాఖ అధికారులు ఎస్‌కె.ఆజాద్‌, దుర్గకుమార్‌బాబు, ఎం.అబ్బయిదొర, అడ్డతీగల తహశీల్దారు తాతారావు, ఎస్‌ఐ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️