గుర్రాలతో పోరాడిన వారు ఎస్మాకు భయపడతారా?

నరసరావుపేటలో జీవో ప్రతులను దహనం చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : గుర్రాలను ఎదిరించి పోరాడిన అంగన్వాడీలు ఎస్మా చట్ట ప్రయోగానికి భయపడతారని ప్రభుత్వం ఎలా అనుకుందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ అన్నారు. సమ్మెలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గాంధీ పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద సమ్మె శిబిరం వద్ద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవో 2 ప్రతులను అంగన్వాడీలు, యూనియన్‌ నాయకులు, వివిధ పార్టీల నాయకులు కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ ఎస్మా చట్టం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని సమ్మె చేస్తుంటే వారిపై ఎస్మా చట్టం ప్రయోగించడం ఎలా చెల్లుబాటవుతుందని ప్రశ్నించారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులని పరోక్షంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్లేనని అన్నారు. సమ్మె ప్రారంభమైన వారం రోజుల్లోపు ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సి ఉంటుదని, అయితే 26వ రోజుల తర్వాత జీవోనిచ్చారని అన్నారు. తాళాలు పగలగొట్టిన అంగన్వాడీ సెంటర్లకు రక్షణ కొరబడిందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని, ఆయనేం మాట్లాడతారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి మసులుకోవాల్సిన ప్రభుత్వం అధికారులను ప్రజా ప్రతినిధులను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగటం తగదన్నారు. ఇందిరా గాంధీ హయాంలో రైల్వే ఉద్యోగులు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించారని, అనంతరం వచ్చిన ఎన్నికల్లో ఘోర పరాజయంపాలయ్యారని గుర్తు చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి టిడిపి కట్టుబడి ఉందని చెప్పారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, పిడిఎం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, జై భీమ్‌ భారత్‌ పార్టీ నాయకులు గోదా జాన్‌పాల్‌ మాట్లాడుతూ అంగన్వాడీలు మహిళలే కదా? అని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అధికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని సమ్మెను అణచాలనుకుంటోందని విమర్శించారు. అంగన్వాడీలకు అన్ని రాజకీయ పార్టీలు, లబ్ధిదారులు, ప్రజలు మద్దతు నిలవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నరసరావుపేట మండల అధ్యక్షుడు షేక్‌ సిలార్‌ మసూద్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డా దేవి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఎన్‌.రామారావు, వి.సింహాద్రి యాదవ్‌, కె.రాంబాబు, వి.వెంకట్‌, యు.రంగయ్య, హెల్డా ఫ్లారెన్స్‌, శోభారాణి, నిర్మల, మాధవి, కవిత, విజయలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 28వ రోజుకు చేరింది. స్థానిక తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో అంగన్వాడీలంతా మోకాళ్లపై నిలబడి కళ్లు మూసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వీరికి సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌ మద్దతు తెలిపారు. యూనియన్‌ సత్తెనపల్లి ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు జి.సుజాత, ఎం.అహల్య, సెక్టర్‌ లీడర్లు చాముండేశ్వరి, ధనలక్ష్మి, జ్యోతి, అంజలి అంగన్వాడీలు పాలొ ్గన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక సురేష్‌ మహల్‌ వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. శిబిరాన్ని యుటిఎఫ్‌ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్మా చట్టం, అది ఎవరికి వర్తిస్తుంది అనే విషయాలపై వివరించారు. యూనియన్‌ నాయకులు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ 27 రోజులుగా సమ్మె చేస్తుండే సరైన రీతిలో స్పందించని ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు శివరామకృష్ణ, ఆంజనేయులు, శారమ్మ, ఉమాశంకరి, నాగజ్యోతి, పద్మ, కృష్ణకుమారి, యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : పట్టణంలోని సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. నాయకులు సైదమ్మ, శాంతలత, శివకుమారి, చిలకమ్మ, రుక్మిణి, శివపార్వతి, కుమారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక గ్రంథాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా పలువురు అంగన్వాడీలు దీక్షల్లో కూర్చున్నారు. వీరికి మద్దతుగా సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. వాగ్దానాలను విస్మరించిన నాయకులను చొక్కా పట్టుకుని నిలదీయాలని గతంలో అంగన్వాడీల ఆందోళనల వద్దకు వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, ఈ విషయాన్ని ఆయనోసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రి మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లను అంగీకరించి సమ్మెను విరమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. నాయకులతో చర్చించాలని, కనీస వేతనం అమలతోపాటు గ్రాడ్యుటి ఇవ్వాలని కోరారు.

➡️