గ్రామీణులకు డిజిటల్‌ సేవలు!

ప్రజాశక్తి – కడప ప్రతినిధిగ్రామీణులకు డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు స్వామిత్వ పథకం పేరుతో ఇళ్లు, ఇళ్లస్థలాల సర్వే నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు. దశల వారీగా గ్రామాలను సర్వే చేయడంపై దృష్టి సారించారు. ఇళ్లు, ఇళ్లస్థలాలను గుర్తించి, శాశ్వత యాజమాన్య హక్కులను దఖలు పరచనున్నారు. ఫలితంగా గ్రామీణుల అనుభవంలోని ఇళ్లు, ఇళ్ల స్థలాలకు గుర్తింపుతోపాటు రిజిస్ట్రేషన్‌ ఆధారిత మార్కెట్‌ విలువను కూడా జోడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జిల్లాలో 557 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని 2,245 గ్రామాల పరిధిలో 3.40 లక్షల గృహాలు ఉన్నాయి. 756 రెవెన్యూ గ్రామాలను స్వామిత్వ పథకం కింద డ్రోన్లతో సర్వేకు శ్రీకారం చుట్టారు. మొదటి విడత కింద ఎంపిక చేసిన 110 రెవెన్యూ గ్రామాల్లో 102 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 25 వేల ఇళ్లు, ఇళ్లస్థలాలను మ్యాపింగ్‌ చేశారు. మిగిలిన ఎనిమిది గ్రామాలను త్వరలోనే డిజిటలీకరణ చేయనున్నారు. అనంతరం దశల వారీగా జిల్లాలోని 557 పంచాయతీలను డిజిటలీకరణ చేయనుండడం గమనార్హం.ఆ ముగ్గురే కీలకం!డిజిటలీకరణలో పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్‌, విఆర్‌ఒలు కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రోన్‌ మ్యాపింగ్‌ అనంతరం ఇంటిటికీ వెళ్లి ఇళ్లు, ఇళ్లస్థలాల వివరాలను నమోదు చేయనున్నారు. ఎటువంటి వివాదం లేని ఇళ్లు, ఇళ్ల స్థలాలను డిజిటలీకరణ చేస్తున్నారు. డిజిటలీకరణతో గ్రామీణులకు, పట్టణ వాసుల తరహాలో ఇళ్లు, ఇళ్ల స్థలాలకు గుర్తింపు లభించనుంది. గ్రామాల డిజిటబ లీకరణ అనంతరం గ్రామీణులకు సంబంధించిన గ్రామనర్తం, డికెటి, పట్టాలు అనే బేధం లేకుండా గ్రామీణుల ఆస్తులకు చట్టబద్దమైన హక్కులు లభించ నున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఒఆర్‌ తరహాలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవ కాశం లభించనున్నట్లు తెలుస్తోంది. శాశ్వత భూహక్కు.. భూరక్ష పేరుతో గుర్తిం పు కార్డులు జారీ చేయనున్నారు. ఫలితంగా గ్రామీణుల ఆస్తులకు రక్షణ లభించనుంది.పెరుగనున్న పన్నుల భారంజిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ నియోజకవర్గాల పరిధిలోని పట్టణ కేంద్రాలకు సమీపంలో ఉన్న గ్రామీణులకు ఆయాచిత వరం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణుల ఆస్తుల కొలతలు చేపట్టనున్న నేపథ్యంలో ఏటా ఐదు నుంచి 10 శాతం పన్నుభారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్రామాల్లో సెక్రటరీలు పెద్ధ ఇళ్లు, పక్కా గృహాలు, పూరిళ్లు ఆధారంగా పన్ను వసూలు చేయడం తెలిసిందే. స్వామిత్వ సర్వే అనంతరం కొలతల ఆధారంగా పక్కా పన్నులు విధించే ప్రమాదం కూడా ఉందని చెప్పవచ్చు ఏదేమైనా ఇళ్లు, ఇళ్లస్థలాలకు శాస్త్రీయ పన్ను విధింపు స్వాగతించగదగిదే. అయితే గ్రామీణులకు వర్తించే పన్నులు, పట్టణ వాసుల తరహాలో ఉంటే భరించడం కష్టమేననే వాదన వినిపిస్తోంది.డిజిటలీకరణతో ప్రయోజనం డిజిటలీకరణతో గ్రామీణులకు అధిక ప్రయోజనం చేకూరనుంది. ఎటువంటి వివాదాలు లేని ఆస్తులకు శాశ్వత భూహక్కు లభించనుంది. ఫలితంగా ప్రజల ఆస్తులకు మార్కెట్‌ విలువ ఆధారిత రేటు లభిస్తుంది. ఫలితంగా రక్షణతోపాటు ఆర్థిక భద్రత, స్తోమత చేకూరుతుంది.- ప్రభాకరరెడ్డి, డిపిఒ, కడప.

➡️