ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

ప్రజాశక్తి – గరివిడి : పట్టణంలో ఉన్న అవంతీస్‌ సెయింట్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం మధ్యాహ్నం స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే, అవంతి విద్యాసంస్థల చైర్మన్‌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్‌ విద్యార్థులు స్వాగతం పలకడం ద్వారా విద్యార్థుల మధ్య ఆరోగ్యవంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, విద్యార్థి దిశ నిర్దేశాన్ని చూపేది కూడా విద్యార్థి దశ అని తెలిపారు. విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచిస్తూ నూతన అంశాలపై దృష్టి సారించి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సైంటిస్ట్‌ కెవివి సంతోషి లక్ష్మి మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అపార ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలన్న దూరదృష్టితో కాలేజీనీ 2001లో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అవంతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు గత 22 సంవత్సరాలు నుండి నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.జాషువా జయప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా గెస్ట్‌ లెక్చర్స్‌, వర్క్‌ షాప్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ విద్యను అందిస్తున్నా మన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అతిథులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో గరివిడి జెడ్‌పిటిసి వాకాడ శ్రీనివాస రావు, గరివిడి మాజీ సర్పంచ్‌ బమ్మిడి అప్పలస్వామి, ఎంపిటిసి వలిరెడ్డి లక్ష్మణ, వలిరెడ్డి బాబ్జి, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.వెంకటరమణ, ఎఒ జి.అనిల్‌ కుమార్‌, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️