జిల్లా స్థాయి కోర్టుల ప్రాధాన్యత పెరగాలి : సుప్రీం కోర్టు న్యాయమూర్తి

Feb 24,2024 19:56

  ప్రజాశక్తి-బొబ్బిలి : న్యాయవ్యవస్థ స్వతంత్రతతో పాటు న్యాయవాద వృత్తిపరంగా స్వతంత్రత కలిగి వుండటం అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. న్యాయవాదులు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోవడం బార్‌ ను బలహీనం చేస్తుందన్నారు. విజయనగరంజిల్లా బొబ్బిలిలో రూ.31.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కోర్టు భవనాల సముదాయానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహ మాట్లాడుతూ జిల్లా కోర్టులపై దృష్టి సారిస్తున్నామనీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో జిల్లా కోర్టులు కూడా భాగమేనని ఇటీవల తాను ఒక తీర్పు సందర్భంగా పేర్కొన్నట్టు చెప్పారు. జిల్లా కోర్టులను బలోపేతం చేయడం ద్వారా, వాటిలో ఆధునిక వసతులు కల్పించడం ద్వారా మాత్రమే కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చే న్యాయవాదులను జిల్లా కోర్టులకు ఆకర్షించ గలమని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పై ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని చెప్పారు. ఈ భవనం ద్వారా వసతులు సమకూరిన తర్వాత ఇక్కడి ప్రజలకు కోర్టుల ద్వారా మెరుగైన సేవలు అందించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు. దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ప్రాంత కోర్టుల్లో భూతగాదాలకు సంబంధించిన కేసులే అధికంగా వచ్చేవని పేర్కొన్నారు. జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి, అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కే.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి. సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, ఎస్‌.పి.దీపిక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపాలకష్ణశర్మ, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️