తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం

Dec 21,2023 21:27

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  యువగళం సభ సక్సెస్‌ కావడంతో తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. అటు జనసేన పార్టీలోనూ జోష్‌ పెరుగుతోంది. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలంటూ టిడిపి, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ దిశానిర్ధేశం చేయడంతో ఇరు పార్టీల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం నిర్వహించిన యువగళం-నవశకం సభకు ఇరు పార్టీలకు చెందిన నాయకులు జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల చెందిన నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. జిల్లాలో మునుపెన్నడూ జరగనంత తీరులో జరగడంతో ఆయా పార్టీల కేడర్‌ ఆనందోత్సవంలో ఉన్నారు. కానీ…. ఆచరణలో ఇరు పార్టీలకు చెందిన నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో అన్నదానిపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. జిల్లా అంతటా కాకపోయినా కొన్నిచోట్ల జనసేన నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమంది ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి ఆశావహులు ఇప్పటికే చాపకింద నీరులా ఎన్నికల వ్యూహంతో పనిచేస్తున్నారు. జనసేన తరపున విజయనగరంలో పాలవలస యశశ్విని గత ఎన్నికల్లో పోటీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా పొత్తు కారణంగా ఆమె స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆమెకు టిక్కెట్‌ దక్కకపోతే విజయనగరంలో టిడిపికి సహకరిస్తారా? ఆమె రాజకీయ భవితవ్వం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెల్లిమర్ల నుంచి గతంలో పోటీకి దిగిన లోకం మాదవి కూడా మళ్లీ పోటీకి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి టిడిపి తరపున కర్రోతు బంగార్రాజు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ టిక్కెట్లు ఆశిస్తున్నారు. తీవ్ర ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల వీరుకాకుండా ఇతరుల పేర్లు తెరమీదకు వచ్చినా పరస్పర సహకారం ఏమేరకు ఉంటుందో అని జనం చర్చించుకుంటున్నారు. పొత్తులో భాగంగా జిల్లాలో ఏ నియోజకవర్గంలో జనసేన పోటీకి అవకాశం దక్కుతుందో అన్న చర్చకుడా నడుస్తోంది. ఈనేపథ్యంలో ఇరు పార్టీల్లోనూ అసంతృప్తులతో నాయకులు బయటపడితే దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు వైసిపి పావులు కదుపుతోంది. ఇటువంటి రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ సమన్వయంతో ముందుకు నడిపే నాయకులు టిడిపిలో లేరనే వాదన వినిపిస్తోంది. పూసపాటి అశోక్‌గజపతిరాజు టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ మండలం, నియోజకవర్గ స్థాయిలో కిందికి దిగి సమన్వయం చేసేంత ఓపిక, సహనం లేదని ఇటు టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు. ఇలాంటి బలహీనతల వల్లే యువగళం సభలోనూ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి మినహా జిల్లా నుంచి ఎవరికీ మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్న చర్చ నడుస్తోంది.

➡️