దృష్టి సారిస్తే గణితం సులువు

Dec 22,2023 21:38

ప్రజాశక్తి – సాలూరు  :  గణితంపై ఇష్టంతో దృష్టి సారిస్తే పట్టు సాధించడం సులువు అవుతుందని స్థానిక రామానుజన్‌ మేథ్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ రంభ రజనీకాంత్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్యవైశ్య ధర్మశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జర్జాపు దీప్తి మాట్లాడుతూ గణితం కష్టమైన సబ్జెక్టు అనే భయాన్ని విద్యార్ధులు వదిలివేయాలని కోరారు. అనంతరం గణిత ప్రతిభా పరీక్షలో విజేతలకు అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఎ.మోహనరావు, డాక్టర్‌ వి.గణేశ్వరరావు, రిటైర్డ్‌ హెచ్‌ఎం వంగపండు రాజేంద్ర ప్రసాద్‌ చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కెవి సత్యనారాయణ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు పాల్గొన్నారు.

పాలకొండ : మండలంలోని తంపటాపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డే జరుపుకున్నారు. పాఠశాల హెచ్‌ఎం పద్మావతి, మ్యాచ్‌ టీచర్లు కెఆర్‌ఎం జయరావు, ఎస్‌.రమేష్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో మేథ్స్‌డే ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలో క్విజ్‌ పోటీలు, ఎస్సే రైటింగ్‌, డిబేట్‌ కాంపిటీషన్‌ అండ్‌ మ్యాథ్స్‌ ఎగ్జిబిషన్‌ జరిగింది. శ్రీనివాస రామానుజమ్‌ పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలలో స్టేట్‌ లెవెల్‌ మ్యాథ్స్‌ క్విజ్‌ పోటీలో స్కూల్‌ విద్యార్థులు ఆర్‌.సాయికిరణ్‌, బి.భవ్య, ఎ.దీపికలకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. వారికి నగదు బహుమతి రూ.6వేలు వచ్చింది. ఆ విద్యార్థులకు ప్రోత్సాహంగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న సూరు శ్రీనువాసరావు టీచర్‌ విద్యార్దుల ప్రతిభకు మెచ్చి ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి విద్యార్థులను అబినందించారు.ఓనిలో….ప్రపంచం గర్వించదగ్గ భారతీయ గణిత మేధావి, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ అని, వోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత రామానుజన్‌ చిత్రపటానికి నాగమణి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామానుజన్‌ జీవితచరిత్రకు సంబంధించి వక్తత్వ, గణిత ప్రశ్నల క్విజ్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కురుపాం : మానవాళి అభివృద్ధికి గణితం ఎంతో కీలకమైందని స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట శంకరరావు అన్నారు. శుక్రవారం భారత గణిత మేధావి శ్రీనివాస్‌ రామానుజన్‌ 135 వ జయంతి సందర్భంగా పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమేశ్వరరావు, ప్రమీల, శ్రీనివాసరావు, సంతోష్‌ పండా, తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురంరూరల్‌ : మండలంలోని డోకిసీల గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు గోవిందరావు ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ నిర్వహించారు. ముందుగా రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన 9, 10 తరగతి విద్యార్థులు పి రాణి, ఎస్‌ నవదీప్‌కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సంరక్షకుడు రమేష్‌ పాల్గొన్నారు.పెదబొండపల్లిలో… మండలంలోని పెదబొండపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 ఆకారాన్ని విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు అనేక ప్రాజెక్ట్లు తయారుచేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని గౌరి గణిత ఉపాధ్యాయులు సూర్యనారాయణ, రామలింగస్వామి, లక్ష్మి, ఈశ్వరరావు, దావీదు, చంద్రకళ, జనార్ధనరావు మాట్లాడారు. అనంతరం బహుమతులను అందజేశారు.

బలిజిపేట : గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా దేశానికి సేవలందించాలని ఎంఇఒ సామల సింహాచలం అన్నారు. మండలంలోని పలగర ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన గణిత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్‌ కు ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థుల బోధన సామర్ధ్యాలను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

➡️