ధాన్యం కొనుగో(మా)ల్‌

Dec 23,2023 21:30

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం గందరగోళంగా తయారైంది. జిల్లాలో సుమారు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అంచనా. ఆ ప్రకారమే జిల్లా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. నేటి వరకు 45 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయినట్లుగా అధికార యంత్రాంగం లెక్కలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా మారి రైతులను అయోమయానికి గురిచేస్తోంది. రైతులు ధాన్యం అమ్మకానికి మిల్లులకు తగిన బ్యాంకు గ్యారంటీ లేకపోవడం, ట్రక్‌సీట్లు జనరేట్‌ కాకపోవడం వల్ల లోడింగ్‌ చేసిన ధాన్యంతో వాహనాలు రోజులు తరబడి నిలిచిపోతున్నాయి.రైతన్నకు రవాణా కష్టాలుఇప్పటికే జిల్లాలో ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదిస్తున్నారు. రవాణా సౌకర్యం అంతంతమాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు సొంతంగా రవాణా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న, సన్న రైతులు తాము పండించిన రెండు మూడు ఎకరాల ధాన్యాన్ని అమ్ముకోవడానికి తగిన రవాణా సౌకర్యం లేక, సొంతంగా రవాణా ఏర్పాటుకు కావాల్సిన చిన్న వాహనాలు అందుబాటులో లేక నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఏదో ఒక విధంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకున్నా ట్రక్‌ షీట్‌ జనరేట్‌ కాకపోవడంతో రోజుల తరబడి వాహనాలు ధాన్యం లోడింగ్‌తో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు సొంతంగా రవాణా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా వాహనాల యజమానులు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడుగా ప్రభుత్వం చెల్లించే రవాణా ఛార్జీలు గిట్టుబాటు కావని, అదనంగా మరికొంత మొత్తాన్ని రైతుల నుంచి వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ వసూలురైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ సిబ్బంది పరీక్షించి ఇచ్చిన నాణ్యతా ప్రమాణ పత్రాన్ని మిల్లర్లు తప్పుపడుతున్నారు. రైతు తీసుకొచ్చిన ధాన్యాన్ని మిల్లులో తాము ఏర్పాటుచేసిన నాణ్యతా పరికరంలో మిల్లర్లు పరీక్షిస్తున్నారు. అక్కడ నాణ్యతా లోపం పేరుతో రైతు నుండి క్వింటాకు 5 కిలోల చొప్పున అదనంగా డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ధాన్యం అన్‌లోడ్‌ చేయించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడుగా అన్‌లోడ్‌ ఛార్జీలు కూడా రైతుల నుండే వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తాము వ్యవసాయ శాఖ సిబ్బందికి, ధాన్యం కొనుగోలు సిబ్బందికి తెలియజేసినా ప్రయోజనం లేదని ఆవేదన చెందుతున్నారుక. తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్ల డిమాండ్‌ చేసిన ధాన్యాన్ని అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.సందర్శనలు తప్పితే తనిఖీలు లేవు కళ్లాల వద్దనే కొనుగోలంటూ చెప్పి తమను పాలకులు, అధికారులు మోసం చేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొంతమంది పైస్థాయి అధికారులు పర్యవేక్షించినా కేవలం ధాన్యం కొనుగోలు నియమ నిబంధనలను గూర్చి అవగాహన కల్పిస్తున్నారు. అంతేతప్ప క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపడం లేదు. బస్తాకు 40 కిలోల ధాన్యం మాత్రమే ఇవ్వాలని అధికారులు చెబుతున్నా మిల్లర్లు 42 కిలోలు చొప్పున డిమాండ్‌ చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సమయంలో ధాన్యం బస్తాలను తనిఖీ చేస్తే అక్రమాలన్నీ బయట పడతాయని చెబుతున్నారు.ఆ బాధ్యత అధికారులదే రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉన్న సాంకేతిక కారణాలను పరిష్కరించాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఆటంకమూ లేకుండా చర్యలు తీసుకోవాలి. నాణ్యత లోపం పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.- రెడ్డి లక్ష్మునాయుడు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

➡️