నాణ్యమైన విద్యుత్‌ సరఫరానే లక్ష్యం

ప్రజాశక్తి-రాయచోటి వ్యవసాయ, గహ రంగం అవసరాలు తీర్చడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో ఆ ప్రాంతం అభివద్ధి చెందేందుకు 132-33 కెవి విద్యుత్‌ ఉపకేంద్రాలు ఎంతో ఉపయోగపడ తాయని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌ మిషన్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గాలివీడు, టి.సుండుపల్లి మండలాలలో నూతనంగా నిర్మించిన రెండు 132-33కెవి విద్యుత్తు ఉప కేంద్రాలు, సంబంధిత లైన్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గాలివీడులో నూతనంగా నిర్మించిన 132-33 కెవి విద్యుత్తు ఉప కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వర్చువల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యేతోపాటు జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, ఎంపిపి చల్లా పద్మావతమ్మ, స్ధానిక సర్పంచ్‌ హాజరయ్యారు. ముఖ్య మంత్రి వర్చువల్‌ కార్యక్రమం ముగిసిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గాలివీడులో రూ.28.44 కోట్లు, టి.సుండుపల్లిలో రూ.28.35 కోట్ల వ్యయంతో నూతనంగా 132-33కెవి విద్యుత్తు ఉప కేంద్రం, సంబంధిత లైన్లను ఏర్పాటు చేశారన్నారు. గాలివీడు, టి.సుండుపల్లి ప్రాంతాలలో అభివద్ధి చెందుతున్న వ్యవసాయ, గహరంగం అవసరాలను తీర్చేందుకు 132-33 కెవి విద్యుత్‌ ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. గాలివీడు విద్యుత్‌ ఉపకేంద్రం ద్వారా గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలు, టి.సుండుపల్లి విద్యుత్‌ ఉపకేంద్రం ద్వారా టి సుండుపల్లి, సంబేపల్లి, వీరబల్లి మండలంలోని కొన్ని ప్రాంతాలు వేగంగా అభివద్ధి చెందే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు లక్ష్యంగా వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన నిరం తర విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కాలుష్యం లేని విద్యుత్‌ ఉత్పత్తిని సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కషి చేస్తున్నారని చెప్పారు. 132 -33 కెవి విద్యుత్‌ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గహ, ఇతర రంగాలకు మెరుగైన విద్యుత్తును అందించే అవకాశం ఏర్పడిందన్నారు. లో ఓల్టేజ్‌ సమస్య పరిష్కారం తోపాటు విద్యుత్‌ సరఫరా లో నష్టాలు, అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. అనంతరం ఉప కేంద్రం అవర ణలో ఏర్పాటు చేసిన గాలివీడు, టి.సుండుపల్లి 132-33కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎస్‌ఇ బాబు రాజేంద్ర, ఇఇ చంద్రశేఖర్‌ రెడ్డి, డిఇఇ అచ్యుత రెడ్డి, విజరు కుమార్‌రెడ్డి, సోలార్‌ పవర్‌ డిఇఇ శివశంకర్‌ నాయుడు, తహశీల్దార్‌్‌ దైవా దీనం, ఎంపిడిఒ శేఖర్‌ నాయక్‌, విద్యుత్‌ శాఖ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

➡️